వస్తుసేవలను వినియోగించే వినియోగదారుల హక్కులను కాపాడడానికి, ఏమైనా నకిలీ వస్తువుల వల్ల ప్రజలు నష్టపోయినపుడు వారు ఫిర్యాదు చేయడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ‘జాగృతి’ పేరుతో 2005వ సంవత్సరం నుంచి ‘మేలుకో వినియోగదారుడా మేలుకో’ అని పత్రిక, టీవీ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించేది. కానీ ఇటువంటి ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం ఎలాంటి ప్రసార మాధ్యమాల్లోనూ కనిపించడం లేదు. ప్రజలు కొనుగోలు చేసిన వస్తువుల్లో ఏమైనా లోపాలున్నా వాటిలో నాణ్యత ప్రమాణాలు సరిగా లేకపోయినా వాటిని విక్రయించిన వారిపై ఫిర్యాదు చేయడానికి వినియోగదారుల కమిషన్ అనేది ఒకటుందని చాలామంది ప్రజలకు తెలియదు.
అందువల్ల వినియోగాదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి, వినియోగదారుల పరిరక్షణ చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం జరపాలి. అలాగే, వినియోగదారుల కమిషన్ అధికారులు గ్రామస్థాయిలో ఉంటున్న ప్రజల దగ్గరి నుంచి మొదలు పట్టణ ప్రాంతాల్లోని వారందరికీ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి పూర్తిగా తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే టీవీ వంటి ప్రసార మాధ్యమాల్లో కూడా వినియోగదారుల చట్టం గురించి ప్రకటనల ద్వారా తెలిసేలా చేయాలి.
లేకపోతే వినియోగదారుల వస్తుసేవల పరిరక్షణ చట్టం కాలక్రమేణా కనుమరుగయ్యే ప్రమాదముంది. కొన్ని జిల్లా, రాష్ట్ర వినియోగదారుల సంఘాలలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు చాలా ఆలస్యంగా పరిష్కారమవుతున్నాయి. దీనిపై వినియోగదారుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నిబంధనల ప్రకారం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నెల రోజుల్లోపు పరిష్కరించాలి. కావున అధికారులు వారికి అందిన ఫిర్యాదులను వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి.
- కె, శ్రావణ్, కొండాపూర్, జనగామ