- ఐదుగురు అనుమానితుల అరెస్టు
- భారీగా ఆయుధాలు స్వాధీనం
- లష్కరే టెర్రరిస్టుతో నిందితులకు సంబంధాలు
బెంగళూర్: కర్నాటకలోని బెంగళూర్‌లో ఉగ్ర దాడులకు జరుగుతున్న కుట్రను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) భగ్నం చేసింది. ఐదుగురు అనుమానిత టెర్రరిస్టులను అరెస్టు చేసింది. వారి నుంచి 7 పిస్తోల్స్, 45 క్యాట్రిడ్జ్‌లు, వాకీటాకీలు, 12 ఫోన్లు, కత్తులు స్వాధీనం చేసుకుంది. ఈ కేసు వివరాలను బెంగళూర్ పోలీస్ కమిషనర్దయానంద వెల్లడించారు. ‘‘అనుమానితులను సొహైల్, ఒమర్, జాహీద్, ముదాసిర్, ఫైజల్‌గా గుర్తించాం. వీళ్లను సుల్తాన్ పాళ్య ఏరియాలోని ఓ ప్రార్థనా స్థలం సమీపంలో సీసీబీ అరెస్టు చేసింది. నిందితులు సిటీలో ఉగ్ర దాడులకు కుట్ర చేశారు. ఆ కుట్రను సీసీబీ భగ్నం చేసింది” అని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా, 15 రోజుల కస్టడీకి అప్పగించిందన్నారు.
ALSO READ :పదేండ్ల పనిపిల్లపై పైశాచికం
ఇద్దరు మాస్టర్ మైండ్స్..
ఈ కుట్ర వెనుక ఇద్దరు మాస్టర్ మైండ్స్ ఉన్నారని కమిషనర్ దయానంద్ చెప్పారు. ‘‘2008లో బెంగళూర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన టి.నజీర్, జునైద్.. ఈ కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్. నజీర్‌కు లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్నాయి. ఇతను ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఇప్పుడు మేం అరెస్టు చేసిన నిందితులపై గతంలో మర్డర్, దోపిడీ, స్మగ్లింగ్ తదితర కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో జైలుకు వెళ్లినప్పుడు నజీర్‌తో వాళ్లకు పరిచయం ఏర్పడింది. వాళ్లందరూ అతని ఆదేశాల మేరకు పేలుళ్లకు ప్లాన్ చేశారు.
వాళ్లకు విదేశాల్లో ఉన్న జునైద్ సహకారం అందించాడు” అని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యతిరేక శక్తులు బలపడ్డాయని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్.అశోక అన్నారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని మాజీ సీఎం బొమ్మై డిమాండ్ చేశారు.