కేంద్ర వివక్ష దక్షిణాదికి అనర్థమే..

కేంద్ర వివక్ష దక్షిణాదికి అనర్థమే..

ఉత్తరాది రాష్ట్రాలకు  కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తోంది. దక్షిణాదికి ఇవ్వకుండా శిక్షిస్తోంది అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఇటీవల ప్రశ్నించారు. తమ హక్కులను పరిరక్షించుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని,  ఇందుకు చొరవ తీసుకుంటానని కూడా ఆయన పేర్కొన్నారు.  కొద్దిరోజుల కింద  కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో  సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్​గా మారాయి.  ఇలా దక్షిణాది రాష్ట్రాల హక్కుల్లోనూ.. అభివృద్ధిలోనూ  కేంద్రం వివక్షను చూపుతోందంటూ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కామెంట్లు చేస్తుండడం  సందర్భానుసారంగా చూస్తూ వస్తున్నాం. 

కేంద్రానికి అధిక పన్నుల వాటాను అందించే రాష్ట్రాలు తమకు ఎక్కువ నిధులు కావాలని డిమాండ్ చేస్తుంటాయి. ఇది సహజం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి  వచ్చినప్పటి నుంచి బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలకు సహకరించడంలేదని మాత్రం విమర్శలు, ఆరోణపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు  కేంద్రం  భవిష్యత్​లో  జనాభా ప్రాతిపదికన లోక్​సభ  సీట్లను పెంచే ఆలోచన చేస్తోంది. అదే జరిగితే.. దక్షిణాదిన తక్కువ జనాభా ఉండడంతో  కేంద్రంలో ప్రాతినిధ్యం బలహీనపడుతుందనే ఆందోళన నెలకొంది.  దీనికితోడు  కేంద్రం నుంచి ఆర్థిక, అభివృద్ధి సహకారం కూడా దక్షిణాదికి సరిగా లేకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశమనే చెప్పొచ్చు. 

ప్రధాని ద్వంద్వ వైఖరేనా?

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రధాని మోదీ.. దేశానికి క్వాసీ ఫెడరలిజం కాదని (మనదేశ రాజ్యాంగం ప్రకారం అర్ధ సమాఖ్య ప్రభుత్వం) కాంపిటేటివ్ ఫెడరలిజం కావాలంటూ చెప్పారు. ప్లానింగ్ కమిషన్​ను  రద్దు చేసి  నీతి ఆయోగ్​ను  తెచ్చారు.  తద్వారా రాష్ట్రాలకు బడ్జెట్​లో  కేటాయింపులు,  పన్నుల వాటాలపైనా నిర్ణయాధికారమంతా నీతి ఆయోగ్ చైర్మన్​గా ప్రధాని అధీనంలోనే ఉంటుంది.  ఇక వన్ నేషన్ - వన్ రేషన్,  వన్ నేషన్ - వన్ ఎలక్షన్,  వన్ ట్యాక్స్ - వన్  నేషన్ వంటి నినాదాలతో  ఏకపక్ష విధానాలతో  కేంద్రం ముందుకెళ్తోంది. మరోవైపు నోట్ల రద్దు,  జీఎస్టీ, వ్యవసాయ, విద్యుత్ వంటి బిల్లులపై రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోకుండానే చట్టాలు చేశారనే ఆరోపణలు రాష్ట్రాలు చేసిన విషయం తెలిసిందే.  

గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు 2004– 2014 వరకు  కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంది. అప్పట్లో  మోదీ  కూడా యూపీఏ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ  రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరించి వేస్తోందని విమర్శించారు. కానీ, ప్రధానిగా ఇప్పుడు ఆయన ధోరణి  కూడా విమర్శనాత్మకంగా ఉండడం గమనార్హం. కేంద్రంలో పదకొండేండ్ల  బీజేపీ పాలనలో (2014 – 2025 ) మోదీ 2016లో  ఒక్కసారి మాత్రమే ఇంటర్ స్టేట్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేశారు.  దీన్నిబట్టే చెప్పొచ్చు రాష్ట్రాలకు కేంద్రం ఎలా సహకరిస్తుందనేది. 

అధికంగా పన్నుల వాటా ఇస్తున్నా..

విదేశాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా ఉంటుంది. అక్కడి ప్రజల జీవన వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయి.  తద్వారా ఆ ప్రాంతాల పన్నుల వాటా కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ, మన దేశంలో ఇందుకు  భిన్నంగా ఉంది. ఉత్తరాదిన అధిక జనాభా ఉండడమే కాకుండా అభివృద్ధిలో పలు రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి. 

అదే దక్షిణాదిన తక్కువ జనాభాతో అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. తద్వారా కేంద్రానికి  పన్నుల వాటా కూడా 30 శాతానికి పైగా ఉందని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.   కేంద్రం అభివృద్ధిగా ఇచ్చే నిధులు మాత్రం తక్కువగా ఉంటున్నాయంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉపాధి వలసలు కూడా దక్షిణాదికి ఎక్కువే.  

దక్షిణాదినా పాగా వేసేందుకేనా?

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ఎన్నాళ్లుగానో  ప్రయత్నాలు చేస్తోంది.  బీజేపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ప్రాంతీయ పార్టీల పొత్తులపైనే ఆధారపడుతూ వస్తోంది. కేవలం ఒక్క కర్నాటకలోనే అధికారం చేపట్టింది. 2023లో  అక్కడ కూడా కోల్పోయింది.  కేరళ, తమిళనాడులో పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది.  ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో ఉంది.  తెలంగాణలో భవిష్యత్​లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ  నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అయితే, ఉత్తరాదికి భిన్నంగా దక్షిణాదిన రాజకీయాలు ఉంటాయనేది తెలిసిందే. అందుకే ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. కాగా, దక్షిణాది ప్రజలను ఆకట్టుకునేందుకు, రాజకీయంగా పట్టు సాధించేందుకు  ప్రధానంగా కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే  దక్షిణాది రాష్ట్రాలను ఆధారపడేలా చేస్తోంది.  భవిష్యత్ లో దక్షిణాదిపై పట్టుకోసమే అభివృద్ధి, నిధుల్లో దక్షిణాది రాష్ట్రాలు ప్రాధేయపడేలా కేంద్రంలోని బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని రాజకీయ విశ్లేషకుల్లో ఒక అభిప్రాయం ఉంది.

అంబేద్కర్ ఏం చెప్పారంటే..

ఉత్తర,  దక్షిణ ప్రాంతాల మధ్య ఎన్నో  వ్యత్యాసాలు కనిపిస్తాయి. హిందీ బెల్ట్ (హిందీ మాట్లాడే) రాష్ట్రాలు ఉత్తరాదిగా.. దక్షిణాది రాష్ట్రాలు బాల్కన్ స్టేట్స్ (మూడు వైపులా సముద్ర తీర ప్రాంతం)గా  రాజ్యాంగ  నిర్మాత  బీఆర్ అంబేద్కర్  పేర్కొన్నారు.  ఆయన రచించిన ‘ ది లింగ్విస్టిక్స్ స్టేట్స్ ఆన్ థాట్స్’లోనూ  ఉత్తరాది,  దక్షిణాది మధ్య విస్తీర్ణం, జనాభా, ఆర్థికంగా,  సామాజికంగా, మతపరంగా ఎన్నో  తేడాలున్నాయని చెప్పారు.   

అంతేకాకుండా దక్షిణాది ప్రజల్లో ఆత్మగౌరవం ఎక్కువేనని.. ఇందుకు  ద్రవిడ అస్తిత్వ, నాస్తిక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉండడమేనని, తద్వారా  రాజకీయ చైతన్యం కూడా ఎంతో ఎక్కువేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ఉత్తరాది పాలకులు దక్షిణాదిపై అధికార పెత్తనం చేయాలని చూస్తే అంగీకరించబోరని కూడా స్పష్టం చేశారు.

==వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్