హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగరా మోగింది. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 30న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటించనున్నారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 8 కాగా.. 11న నామినేషన్లు పరిశీలించనున్నారు. అదే నెల 13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థిత్వానికి, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు ఈటల రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుండటంతో బై పోల్‌లో ఈసీ పలు నిబంధనలు విధించింది. ఎలక్షన్ ప్రచారంలో ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని తెలిపింది. అభ్యర్థితో సహా ఐదుగురుకి డోర్ టూ డోర్ ప్రచారానికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. రోడ్ షోలపై బ్యాన్ విధించింది. బైక్ ర్యాలీలు నిర్వహించవద్దని పేర్కొంది. 72 గంటల ముందే ప్రచారం ముగించాలని చెప్పింది. ఇండోర్ మీటింగ్‌లకు 200 మందికి పర్మిషన్ ఇచ్చింది. కాగా, ఆంధ్ర ప్రదేశ్‌లోని బద్వేల్‌లో కూడా వచ్చే నెల 30న ఉప ఎన్నిక, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. బద్వేల్‌లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ కూడా బైపోల్స్ నిర్వహించనుంది.