- షరతులతో కూడిన అనుమతులిచ్చిన కమిషన్
- రాజకీయ నేతలు పాల్గొనవద్దని ఆదేశం
- ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎస్
- మిథిలా స్టేడియంలో కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
- అభిజిత్ లగ్న ముహూర్తంలో మాంగల్యధారణ
హైదరాబాద్/భద్రాచలం, వెలుగు : భద్రాచలం రాములోరి కల్యాణం లైవ్ టెలికాస్ట్ చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి ఏడాదిలాగే ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించింది. కోట్లాది మంది భక్తులు రాములోరి కల్యాణాన్ని లైవ్‌గా చూసేందుకు వీలు కల్పించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. భద్రాద్రి క్షేత్ర ప్రాముఖ్యత, రాములోరి కల్యాణ వేడుకను శ్రీరామ నవమి రోజున లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుతివ్వాలని కోరుతూ గత నెలలో రాష్ట్ర సర్కార్ ఈసీకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ఏప్రిల్ 4న ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. తమ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా ఏప్రిల్ 6న మళ్లీ ఈసీని రాష్ట్ర సర్కార్ కోరింది.
భద్రాద్రి రామయ్యకు దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని లేఖలో పేర్కొంది. రాములోరి కల్యాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని వివరించింది. భక్తులు చూసేందుకు వీలుగా లైవ్ టెలికాస్ట్కు పర్మిషన్ ఇవ్వాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. 1987 నుంచి ప్రత్యక్ష ప్రసారం ఆనవాయితీగా వస్తున్నదని, 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ లైవ్ ఇచ్చిందని ఈసీకి రాసిన లేఖలో రాష్ట్ర సర్కార్ గుర్తు చేసింది. రేడియో ద్వారా కల్యాణ మహోత్సవ వ్యాఖ్యానం ప్రసారమైందని తెలిపింది.
కోట్లాది రామ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని కోరింది. రెండో సారి చేసిన అభ్యర్థనపై ఈసీ స్పందించింది. కొన్ని షరతులతో లైవ్ టెలికాస్ట్కు పర్మిషన్ ఇచ్చింది. రాజకీయ ప్రసంగాలు చేయడం, నేతలు పాల్గొనడంపై ఆంక్షలు విధించింది. క్యాంపెయిన్ కూడా చేయొద్దని సూచించింది. కాగా, భద్రాద్రి రాములోరి కల్యాణ ప్రత్యక్ష ప్రసారాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈసీని కోరారు. 45 ఏండ్లుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని వివరించారు.
రాములోరి లగ్గానికి సర్వం సిద్ధం
రాములోరి లగ్గానికి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న ముహుర్తంలో మాంగల్యధారణ జరగనున్నది. దీనికి కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ వేడుకలకు సీఎం రేవంత్ హాజరుకావడం లేదు.
ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీని కోసం ఆమె మంగళవారమే భద్రాచలం చేరుకున్నారు. ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, 18న జరిగే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.
రూ.3కోట్లతో ఏర్పాట్లు
సీతారాముల వారి పెండ్లికి రూ.3కోట్లు ఖర్చు పెట్టి అధికారులు ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక వసతులు, 250 కిలోల తలంబ్రాలు, 2.50లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. 2.50లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు పోస్టల్, ఆర్టీసీ ద్వారా ఇంటింటికి పంపిస్తున్నారు. మిథిలా ప్రాంగణంలో 40వేల మంది భక్తులు కల్యాణం వీక్షించేలా 24 సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఎండను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌలత్లు కల్పించారు.
8 చోట్ల వెహికల్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్ నుంచి ఆలయానికి ఫ్రీ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను దృష్టిలో పెట్టుకుని 1,800 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాచలంలో ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో మంగళవారం రాత్రి సీతారామచంద్రుల ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం రామయ్య, సీతమ్మ, లక్ష్మణులను గరుడ వాహనంపై ఊరేగింపుగా రాజవీధి గుండా తీసుకొచ్చారు. వైకుంఠ ద్వారం వద్ద వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి తరఫున కొందరు, రాముల వారి తరఫున మరికొందరు వేదపండితులు విడిపోయి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
శుభలేఖను ముందుగా భక్తులకు చదివి వినిపించారు. అనంతరం స్వామి తిరువీధి సేవకు బయలుదేరి వెళ్లారు. సీతారాములకు భక్తులు హారతులతో నీరాజనాలు పలికారు. జీయర్‍స్వామి మఠం నుంచి వచ్చిన నూతన వస్త్రాలను ఆనవాయితీగా సీతారాములకు సమర్పించారు. ఈ వస్త్రాలనే కల్యాణం నాడు మూలమూర్తులకు అలంకరించనున్నారు. ఈ ఉత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దంపతులు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్ రాజ్, దేవస్థానం ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.