31న సాయంత్రం 4లోపు సమాధానం చెప్పాలి...రాజగోపాల్ రెడ్డికి సీఈసీ ఆదేశం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుండి రూ. 5 కోట్ల 24 లక్షలు బదిలీ అయినట్లు ఫిర్యాదు రావడంతో....అక్టోబర్ 31న సాయంత్రం 4 గంటల లోపు దీనిపై సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆదేశించింది. 

సీఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజగోపాల్ రెడ్డి వారి అకౌంట్లకు నగదు  బదిలీ చేసినట్లు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈనెల 18న, 29న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ద్వారా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని  23 వేర్వేరు వ్యక్తులు, కంపెనీలకు సుషీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నగదు  బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  

అంతా అబద్దం...
మరోవైపు  సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి మునుగోడులోని రాజగోపాల్ అనుచరులకు డబ్బులు పంపారన్న ఆరోపణలను  సుశీ ఇన్ ఫ్రా ఎండీ కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి కొట్టిపారేశారు. అసలు అలాంటి లావాదేవీలేమి జరగలేదని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ కంపెనీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారని కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి చెప్పారు. నిన్న ఈసీకీ టీఆర్ఎస్ ఇచ్చిన ఎకౌంట్ నెంబర్లలో వాళ్లు చెప్పినన్ని డబ్బులు లేవని.. వాటికి సంబంధించిన స్టేట్మెంట్లు రిలీజ్ చేశారు. ఇది కేటీఆర్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వస్తున్న కొత్త సినిమా కథ అని ట్వీట్ చేశారు. రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో  టీఆర్ఎస్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి రోజూ డ్రామాలు నడుస్తాయని..ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు.