- 3,517 పోలింగ్‌కేంద్రాలు
- మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
- వచ్చే ఏడాది జనవరి 6న ఫైనల్ లిస్టు రిలీజ్
- ఈ నెల 28 వరకు అభ్యంతరాల స్వీకరణ
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు వచ్చే ఏడాది (2025) జనవరి వరకు అవకాశం కల్పిస్తోంది. నూతన ఓటరు జాబితా తయారీలో భాగంగా ఆగస్టు 20 నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు బీఎల్వోలు ఇంటింటా సర్వే నిర్వహించి ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేపట్టారు.
అందుకు అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్‌కేంద్రాల్లో ప్రచురించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 3,517 పోలింగ్ కేంద్రాల్లో 29,90,319 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వచ్చే ఏడాది జనవరి 6న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. వచ్చే ఏడాది జనవరి దాకా ఓటరు నమోదుకు అవకాశం ఉన్నందున ఓటర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
మహిళా ఓటర్లే ఎక్కువ..
ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కరీంనగర్‌లో అత్యధిక ఓటర్లు 3,66,646 మంది, రామగుండంలో అత్యల్పంగా 2,20,342 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 14,56,825 మంది, మహిళా ఓటర్లు 15,33,310 మంది, ఇతరులు 184 మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
అభ్యంతరాల స్వీకరణ..
ఎన్నికల అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఏమైనా చేర్పులు, తొలగింపులు, సవరణలు ఉంటే నవంబర్28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు పోలింగ్‌కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు. కొత్తగా చేరాలనుకునే వారు ఫారం-6, తొలగించుకోవాలనుకునే వారు ఫారం-7, సవరణ చేసుకోవాలనుకునే వారు ఫారం-8 ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు నవంబరు 9, 10 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది జాబితాను ప్రకటించనున్నారు.
ఉమ్మడి జిల్లా ఓటరు ముసాయిదా జాబితా వివరాలు
అసెంబ్లీ పోలింగ్‌కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
కోరుట్ల 262 117287 129916 4 247207
జగిత్యాల 254 113928 123872 23 237823
ధర్మపురి 269 112972 118863 9 231844
రామగుండం 262 110011 110303 28 220342
మంథని 292 117953 123148 15 241116
పెద్దపల్లి 291 127106 130920 7 258033
కరీంనగర్ 390 182791 183810 45 366646
చొప్పదండి 327 113314 121179 8 234501
మానకొండూర్ 316 110503 116063 1 226567
హుజూరాబాద్ 305 122215 129122 7 251344
వేములవాడ 262 108675 118808 30 227513
సిరిసిల్ల 287 120070 127306 7 247383
మొత్తం 3517 145682 1533310 184 29,90,319