ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
  • 5 ఖాళీ స్థానాలకుమార్చి 3న నోటిఫికేషన్ ..10 వరకు నామినేషన్లు 
  • 11న నామినేషన్ల పరిశీలన
  • 20న పోలింగ్​.. అదేరోజు ఫలితాల వెల్లడి
  • వచ్చే నెల 29 నాటికి  సత్యవతి రాథోడ్​,మహమూద్​ అలీ, శేరి సుభాష్​​రెడ్డి,ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్​పదవీకాలం పూర్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది.  ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరగనుంది.  అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు.  

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో మార్చి 29 నాటికి 10 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఇందులో తెలంగాణలో సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హసన్‌ ఉన్నారు.  ప్రస్తుతం  మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్​  బీఆర్ఎస్​ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎగ్గె మల్లేశం మాత్రం కొద్ది నెలల క్రితమే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి కాంగ్రెస్‌‌‌‌లో  చేరారు. మీర్జా రియాజుల్​ హసన్​ ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. 

కాంగ్రెస్​4 గెలుచుకునే చాన్స్​..

తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో 4 సీట్లను అధికార కాంగ్రెస్‌‌‌‌, ఒక స్థానాన్ని ప్రతిపక్ష బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ దక్కించుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనేది పద్ధతి ప్రకారం చేస్తారు. తెలంగాణ అసెంబ్లీలో  మొత్తం  ఎమ్మెల్యేల సంఖ్య 119. ఎన్నిక నిర్వహించాల్సిన సభ్యుల సంఖ్యకు ఒక్కటి కలిపి  మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతో   భాగించాల్సి ఉంటుంది. 

వచ్చే ఫలితానికి ఒకటి కలిపితే.. అదే ఎన్నికకు కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా మారుతుంది.  ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో  119 మంది సభ్యులున్నారు.  ఎమ్మెల్యే కోటా కింద  5 ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికలు జరగాల్సి ఉంది.  119 సభ్యులకు  5  ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలకు ఒకటి కలిపి భాగిస్తే  ఈ సంఖ్య 19.83  అవుతుంది. దీనికి ఒకటి కలిపితే 20 దాటుతున్నది. 

ఇదే   ఎమ్మెల్సీ స్థానానికి కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా గుర్తిస్తారు. ఒకవేళ పోలింగ్​ అనివార్యమైతే.. మొత్తం 119 ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొంటే   ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యం కింద 20  ఓట్లు రావాలి. సభ్యులెవరైనా రాని పక్షంలో అదికాస్త తగ్గుతుంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి  64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో  కాంగ్రెస్ బలం  65కు చేరుతుంది.  

కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎంఐఎంను కాంగ్రెస్​కు సపోర్ట్​ కోరే చాన్స్​ ఉంది. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్​ 4  స్థానాలను కైవసం చేసుకోనున్నట్టు తెలుస్తున్నది.  మొదటి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కించాలి. ఒక అభ్యర్థి కోటాను చేరుకున్నట్లయితే, వారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.  ఒక అభ్యర్థి కోటా కంటే ఎక్కువ ఓట్లు పొందినట్లయితే, ఓటర్ల ప్రాధాన్యతల ఆధారంగా మిగులు ఓట్లు తదుపరి ప్రాధాన్యత గల అభ్యర్థులకు బదిలీ చేస్తారు.  

ఏ అభ్యర్థి కోటాను చేరుకోకపోతే, తక్కువ ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగిస్తూ..వారి ఓట్లు తదుపరి ప్రాధాన్యత గల అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఎన్నికలు జరుగుతాయా?  లేదా ఏకగ్రీవమవుతాయా? అనేది బీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎం పోటీని బట్టి తేలనున్నది. 

ఎన్నికల షెడ్యూల్

ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ జారీ : మార్చి 3
నామినేషన్లకు చివరి తేది: మార్చి 10
నామినేషన్ల స్క్రూటినీ : మార్చి 11
నామినేషన్ల ఉపసంహరణ : మార్చి 13
పోలింగ్‌‌‌‌: మార్చి 20 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు
ఓట్ల లెక్కింపు : మార్చి 20