
- లీజ్‌కు కూడా ఇవ్వొద్దు.. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫారసు సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అందజేత
- ఆ ఏరియాను సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాలి
- వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్తో అంచనా వేయించేదాకా ఏ పనులూ చేపట్టొద్దు
- 1,524 రకాల చెట్లను నరికేశారు.. అందులో వాల్టా నుంచి మినహాయింపులేని 125 రకాల చెట్లున్నయ్
- పలు విభాగాల నిపుణులతో మా కమిటీని పునరుద్ధరించాలి
- ఆ భూమి హెచ్‌సీయూ యాజమాన్యంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నదని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి భూమి ఎవరిదో తేలే వరకు ఆ భూమిని అమ్మడం, తనఖా పెట్టడం, లీజ్ కు ఇవ్వడం వంటి చర్యలకు టీజీఐఐసీ పాల్పడకుండా చూడాలని సుప్రీంకోర్టుకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సిఫారసు చేసింది. ఈ ప్రాంతంలోని జీవవైవిధ్యం, వన్యప్రాణులు, సరస్సుల ఉనికిని దృష్టిలో ఉంచుకుని.. పర్యావరణపరంగా సున్నితమైన జోన్‌గా పరిగణించాలని కోరింది. ఈ మేరకు సుమారు 1,500 పేజీలతో మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది.
ఇందులో ఇప్పటి వరకు ఈ భూములకు సంబంధించిన వివరాలు, కోర్టు వివాదాలు–తీర్పులు, చేపట్టిన పనులు, వివిధ విభాగాల నిర్ణయాలు, పోలీస్ శాఖ రిప్లే, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రిప్రజెంటేషన్, భూములపై ప్రభుత్వ మార్టిగేజ్ లకు సంబంధించిన మొత్తం 45 అనెక్స్ రిపోర్ట్ లను పొందుపరిచింది. 8 సిఫారసులను చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా సమగ్ర పర్యావరణ అంచనా నిర్వహించేవరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని కమిటీ పేర్కొంది. ఫారెస్ట్ ఏరియా సరైన గుర్తింపు కోసం పలు విభాగాల నిపుణులతో తమ కమిటీని పునరుద్ధరించాలని నివేదించింది. ఇందులో ఫీల్డ్ ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలను చేర్చాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కోరింది.
మినహాయింపులేని చెట్లనూ నరికారు
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఈ నెల 10న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులు, హెచ్‌సీయూ, టీజీఐఐసీ ప్రతినిధులతో కలిసి వివాదాస్పదస్థలాన్ని పరిశీలించింది. ఈ విషయాన్ని రిపోర్టులో పేర్కొంది. వివాదాస్పద 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించినట్లు గుర్తించామంది. ఇందులో ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 122 ఎకరాల(49.63 హెక్టార్లు) భూమిలో టీజీఐఐసీ పనులకు ప్రయత్నించిందని, ఈ స్థలంలోని భారీ వృక్షాలను భారీ మిషిన్లతో తొలగించినట్లు తాము గుర్తించామని కమిటీ పేర్కొంది. బండరాళ్లను భారీ యంత్రాల ద్వారా ధ్వంసం చేశారని, వాల్టా యాక్ట్ – 2002, సెక్షన్ 24 (4) లోని నిబంధనల నుంచి మినహాయింపులేని 125 రకాల చెట్లను నరికివేశారని తెలిపింది. మొత్తం 1,524 రకాల చెట్లను నరికివేయగా వాటిలో 1,399 రకాలకు మాత్రమే మినహాయింపు ఉందని పేర్కొంది. ఫారం 13–ఏ లో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన టీజీఐఐసీ అధికారులు, చెట్లను ధ్వంసం చేసిన కాంట్రాక్టర్ (ఎంఎస్ డెల్టా గ్లోబల్ సర్వీసెస్) పై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
వివాదాస్పద భూమి ప్రాథమికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యంలో ఉన్నట్లే కనిపిస్తున్నదని కమిటీ అభిప్రాయపడింది. కంచ గచ్చిబౌలి గ్రామంలోని 2,374 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ‘కంచ అస్తాబల్ పోరంబోకు సర్కారీ’గా విశ్వవిద్యాలయానికి కేటాయించినట్లు పేర్కొంది. ప్రస్తుత వివాదాస్పద భూమి అడవులకు ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉందని నివేదించింది. గొప్ప జీవ వైవిధ్యం, వన్య ప్రాణులు ఉన్న ఈ భూమిని పర్యావరణపరంగా సున్నితమైన జోన్ గా ప్రకటించాలని కోరింది. 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, ఇతర ఆర్థిక ఆరోపణల దృష్ట్యా సమగ్ర విచారణకు ఆదేశించాలంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా సమగ్ర పర్యావరణ అంచనా నిర్వహించే వరకు అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది.