కంచ గచ్చిబౌలి భూముల్లో ‘సుప్రీం’ కమిటీ..

కంచ గచ్చిబౌలి భూముల్లో ‘సుప్రీం’  కమిటీ..
  • సర్వే నెంబర్ 25ను పరిశీలించిన సభ్యులు
  • సుమారు గంటపాటు అక్కడే ఉన్న కమిటీ
  • ఐదుగురు హెచ్ సీయూ విద్యార్థులతో ఎంసీహెచ్ఆర్డీలో భేటీ
  • కమిటీకి వినతి  పత్రం ఇచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు
  • వృక్ష సంపద ఎంత..? డీమ్డ్ ఫారెస్టా..? ఆరా తీసిన కమిటీ

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ  హైదరాబాద్ లోని ఆ ల్యాండ్స్ ను పరిశీలించింది.   కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల స్థలాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఈ కమిటీలోని సభ్యులైన మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ చంద్రప్రకాశ్ గోయల్, మాజీ మహారాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సునీల్ లిమయే  రాష్ట్ర అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారు.

ఆ స్థలంలోని వృక్షసంపద, వన్యప్రాణుల పరిస్థితిని తెలుసుకున్నారు. అది "డీమ్డ్ ఫారెస్ట్" కిందకు వస్తుందా లేదా అనే దానిపై ఆరా తీసినట్టు సమాచారం.  సుప్రీంకోర్టు కమిటీని కలిసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు. సుమారు గంటపాటు హెచ్ సీయూలో ఉన్న కమిటీ ఇక్కడికి నుండి జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రానికి బయలుదేరి వెళ్లింది. హెచ్ సీయూ విద్యార్థులు ఐదుగురిని అక్కడికి వచ్చి కలిసి తమ అభిప్రాయాలను చెప్పాలని కమిటీ సూచించింది.  

ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు బస చేసిన తాజ్ కృష్ణ హోటల్ కు మాజీ మంత్రి హరీశ్ రావుతో కూడిన బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లింది. ఈ సందర్భంగా భూముల వ్యవహారంలో డాక్యుమెంట్లు, విజువల్స్‌తో కూడిన నివేదికను కమిటీకి అందించింది.  ఈ కమిటీ ఇక్కడ అధ్యయనం చేసి వాస్తవాలతో కూడిన నివేదికను ఏప్రిల్ 16న సుప్రీంకోర్టుకు అందించనుంది.