- జనం నుంచి వస్తున్న ఫిర్యాదులకే పెనాల్టీలు
- మాన్యువల్ పేరుతో అస్సలు వేస్తున్నరో లేదో తెలియట్లే
- ఇప్పటికే లీడర్లపై రూ.100 కోట్ల ఫైన్లు పెండింగ్
- వసూలు చేయడంలో వెనకడుగు వేస్తున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీ పరిధిలో పొలిటికల్ లీడర్ల ఫ్లెక్సీలకు సీఈసీ(సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్) ఎలాంటి ఫైన్లు వేయడం లేదు. గతంలో ఎక్కడ ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేసినా జనం వచ్చే ఫిర్యాదులతోపాటు సీఈసీ సిబ్బంది స్వయంగా ఫొటోలు తీసి ఫైన్లు వేసేవారు. కానీ నాలుగు నెలలుగా పట్టించుకోవడం లేదు. జీవో 68 ప్రకారం మాన్యువల్‌గా చలాన్లు వేస్తున్నారని, ఆ బాధ్యతలు శానిటేషన్ విభాగం అధికారులు చూస్తున్నారని సీఈసీ అధికారులు చెబుతున్నారు. తాము కేవలం వాల్‌పోస్టర్లు, స్టిక్కర్లు, వాహనాల్లో ప్రమాదకరంగా మట్టి, ఇసుక తరలింపుపై వచ్చే ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా సేకరించి ఫైన్లు వేస్తున్నామంటున్నారు. అయితే కొన్నాళ్లుగా సీఈసీ ట్విట్టర్ అకౌంట్ ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదని తెలుస్తోంది. ఫ్లెక్సీలు, హోర్డింగులపై మొన్నటివరకు ఆన్ లైన్లో ఫైన్లు వేస్తుండటంతో ఎవరికి ఎంత వేస్తున్నారన్న విషయం తెలిసేది. ప్రస్తుతం మాన్యువల్వేస్తున్నారని చెబుతుండటంతో అసలు ఫైన్లు వేస్తున్నారా? లేదా అనేది తెలియడం లేదు. ఎప్పటికప్పుడు అధికార పార్టీతోపాటు వివిధ పార్టీల లీడర్లు పెద్ద పెద్ద ఫెక్సీలు, కటౌట్లు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. మరి వాటన్నింటికి ఎంత మేరకు ఫైన్లు వేస్తున్నారో తెలియాల్సి ఉంది.
కేవలం 30 కోట్లు వసూలు
2019 నుంచి పలు సందర్భాల్లో వివిధ పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులతో పాటు పబ్లిక్ ప్లేసుల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లపై సీఈసీ రూ.130 కోట్లు ఫైన్లు వేసింది. ఇందులో కేవలం రూ.30 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.వంద కోట్లు వసూలు చేయాల్సి ఉంది. పొలిటికల్ లీడర్లకు వేసిన ఫైన్లలో ఒక శాతం కూడా చెల్లించలేదు.
అన్నిపార్టీల లీడర్లకు ఫైన్లు వేసినట్లు ఆన్ లైన్ లో నోటీసులు చూపిస్తున్నప్పటికీ పైసలు మాత్రం వసూలు చేయడం లేదు. అధికార పార్టీ లీడర్లు కూడా ఎవరూ చెల్లించేందుకు ముందుకు రావడంలేదు. వసూలు విషయంలో బల్దియా కూడా సైలెంట్ అయింది. అధిక శాతం అధికారపార్టీ నేతలకి సంబంధించినవే ఉండటంతో అధికారులు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. గతేడాది చివరిలో ఫైన్లపై రాయితీ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేశారు. కానీ లీడర్లు చెల్లిస్తారో.. లేదోనని ఆ ప్రతిపాదనను అక్కడితో ఆపేశారు.
జనం నుంచి మాత్రం..
ఫ్లెక్సీలు, పోస్టర్ల విషయంలో పొలిటికల్ లీడర్లతోపాటు వ్యాపారులు, సామాన్యులకు అధికారులు సమానంగా ఫైన్లు వేస్తున్నప్పటికీ వసూలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. సామాన్యులు భయంతో వెంటనే చెల్లిస్తున్నారు. పొలిటికల్ లీడర్లు మాత్రం ఫైన్లు పడుతున్నాయని తెలిసి కూడా ఫ్లెక్సీలు పెడుతూనే ఉంటున్నారు. మొత్తం రూ.130 కోట్ల ఫైన్లలో 90 శాతం వరకు పొలిటికల్ లీడర్లకు సంబంధించినవే ఉన్నట్లు తెలుస్తోంది. చలాన్లు వేసిన సమయంలో నోటీసులను అందుకుంటున్న లీడర్లు వాటిని లెక్క చేయడంలేదు. అధికారులు వసూలు చేసిన రూ.30 కోట్లలో విద్యాసంస్థలు, పలు ప్రైవేట్సంస్థలు, షాపింగ్ మాల్స్ తోపాటు చిన్నచిన్న వ్యాపారులు చెల్లించిన ఫైన్ల పైసలే ఉన్నాయి.