దేశ పరిపాలనను నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ పరిపాలన నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యన రాజ్యాంగం ద్వారా అధికారాల పంపిణీ జరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధికి కట్టుబడి తమ తమ పరిపాలన పరిధిలో స్వతంత్రంగా పరిపాలన నిర్వహించడం సమాఖ్య ముఖ్య లక్షణం. దేశ పరిపాలనకు సంబంధించిన అధికారాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే కలిగి ఉండి పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ప్రాంతీయ ప్రభుత్వాలకు అవసరాన్నిబట్టి కేంద్రం అధికారాలను దత్తత ఇస్తుంది. అలాగే స్థానిక ప్రభుత్వాలు స్వతంత్రత, చొరవను కలిగి ఉండే అవకాశం ఉండని విధానాన్ని ఏక కేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని సంపూర్ణ సమాఖ్యగా కాకుండా అలాగే పూర్తి ఏకకేంద్ర ప్రభుత్వంగా కాకుండా ఈ రెండింటి కలయికగా అంటే ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాల కలయికగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలో ఏక కేంద్ర లక్షణాలను పరిశీలిద్దాం.
బలమైన కేంద్ర ప్రభుత్వం: వాస్తవ సమాఖ్యలో బలమైన రాష్ట్రాలు, బలహీనమైన కేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి. మన దేశంలో బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే కేంద్రానికి 98 అంశాలపై అధికారాలను కల్పించగా, రాష్ట్రాలకు కేవలం 59 అంశాలపైనే అధికారాలను కల్పించారు. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న 52 అంశాలపై పరోక్షంగా కేంద్రానికి అధికారం ఉంటుంది. అంతేకాకుండా అవశిష్ట అధికారాలను కూడా కేంద్రానికి కేటాయించడంతో మన దేశంలో బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత: 365వ అధికరణ ప్రకారం కేంద్రం జారీ చేసే పరిపాలన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది.
గర్నవర్ వ్యవస్థ: రాజ్యాంగం ద్వారా రాష్ట్రానికి అధిపతి గవర్నర్. రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీదనే జరుగుతుంది. గవర్నర్ల నియామకం, బదిలీలు, తొలగింపులో అధికారం కేంద్రానికి ఉంటుంది. గవర్నర్ల విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు.
ఏక పౌరసత్వం: వాస్తవ సమాఖ్యను అనుసరించే అమెరికాలో కేంద్ర పౌరసత్వం, రాష్ట్ర పౌరసత్వాలు వేర్వేరుగా ఉండగా, మన దేశం ఏక పౌరసత్వాన్ని ప్రసాదిస్తున్నది. ఆ పౌరసత్వం కూడా కేంద్ర జాబితాలో ఉంది.
సమీకృత న్యాయవ్యవస్థ: భారతదేశం కేంద్రీకృతమైన న్యాయవ్యవస్థను కలిగి ఉంది. రాష్ట్రాల్లో హైకోర్టులను ఏర్పాటు చేసినా హైకోర్టులు కేంద్ర జాబితాలో ఉన్నాయి. మన దేశ న్యాయవ్యవస్థ పని విధానంలో సుప్రీంకోర్టు తిరుగులేని అధికారాలను నిర్వర్తిస్తున్నది.
ఒకే రాజ్యాంగం: వాస్తవ సమాఖ్యను అనుసరించి అమెరికాలో కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేకంగా రాజ్యాంగాలను రూపొందించుకుని అమలు చేస్తున్నారు. మన దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది.
రాజ్యాంగ సవరణలో కేంద్రం ఆధిక్యత: రాజ్యాంగంలోని ఎక్కువ విషయాలు పార్లమెంట్ సాధారణ మెజార్టీ లేదా 1/3వ వంతు మెజార్టీ ద్వారానే సవరిస్తారు.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంట్‌దే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆయా రాష్ట్రాల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా కేంద్రమే తమ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు.
రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం: అమెరికా ఎగువ సభ అయిన సెనేట్‌లో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది. మన రాజ్యసభలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌కు 31 స్థానాలు ఉండగా, అసోం మినహా మిగిలిన ఏడు ఈశాన్య రాష్ట్రాలకు, గోవాకు ఒక్కొక్క స్థానమే కేటాయించారు.
అత్యవసర పరిస్థితులు: 18వ భాగంలోని అత్యవసర అధికారాలు ఏకకేంద్ర లక్షణాలను తెలియజేస్తున్నాయి.
- ఆర్టికల్ 352 ప్రకారం: జాతీయ అత్యవసర పరిస్థితి కాలం విధించిన సందర్భంలోనూ,
- ఆర్టికల్ 356 ప్రకారం: రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించినప్పుడూ,
- ఆర్టికల్ 360 ప్రకారం: ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలోనూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర, రాష్ట్రాల పాలనను శాసిస్తుంది.
- అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందడం: వాస్తవ సమాఖ్యను అనుసరించి అమెరికా దేశంలో మిగులు అధికారాలు అంటే అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు కేటాయించగా మన దేశంలో మాత్రం అవశిష్ట అధికారాలను కేంద్రానికి కేటాయించారు.
- అదృఢమైందిగా ఉండటం: రాజ్యాంగంలోని ఎక్కువ విషయాలను కేంద్రం ఏకపక్షంగా సవరించుకునే అవకాశాన్ని కలిగి ఉంది. కానీ వాస్తవ సమాఖ్యలో రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయాలన్నా రాష్ట్రాల ఆమోదం తప్పనిసరిగా పొందాలి.
దేశ విభజన కాలం నాటి పరిస్థితులు: భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందే సమయంలో భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా మత ప్రాతిపదికన విడిపోయి స్వాతంత్ర్యాన్ని పొందాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో మత సంఘర్షణలు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించాలంటే దేశాన్ని ఒకటిగా నిలపాలంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం అవసరమైంది. అందువల్ల కేంద్రానికి ఎక్కువ అధికారాలు కల్పించి బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
స్వదేశీ సంస్థానాల విలీనీకరణ: దేశ స్వాతంత్ర్య కాలం నాటి స్వదేశీ సంస్థానాల సంఖ్య 562 ఉండగా, వీటిలో 554 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే సందర్భంలో కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రానికి ఎక్కువ అధికారాలను కల్పించారు.
భిన్నత్వంలో ఏకత్వం: భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలన్నా అలాగే దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాలన్నా కూడా కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా భారతదేశం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను అనుసరించింది. భారతదేశం సామ్యవాద తరహా సమాజ స్థాపన తన లక్ష్యంగా ప్రకటించుకున్నది. అలాగే, మన దేశం సంక్షేమ రాజ్య స్థాపనకు కట్టుబడి పనిచేస్తున్నది. ఈ మూడు లక్ష్యాలను సాధించాలంటే కేంద్రంలో ఒక సమర్థవంతమైన ప్రభుత్వం అవసరమైంది.
సంస్థల పాత్ర
అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ల ఉద్యోగులను ఎంపిక చేసే యూపీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులను కేంద్రమే నియమిస్తుంది.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్: కేంద్ర ప్రభుత్వ ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసే కాగ్ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు కూడా తనిఖీ చేస్తుంది.
కేంద్ర ఆర్థిక సంఘం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే ఫైనాన్స్ కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.
కేంద్ర ఎన్నికల సంఘం: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ ఎన్నికలతోపాటు రాష్ట్రాలకు కూడా సాధారణ ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్రమే నియమిస్తుంది.
అంతర్రాష్ట్ర మండలి: కేంద్రానికి రాష్ట్రాలకు, రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలను సామరస్యంగా పరిష్కరించడానికి ఏర్పాటు చేసే అంతర్రాష్ట్ర కౌన్సిల్‌ను కూడా కేంద్రమే నియమిస్తుంది.
జోనల్ కౌన్సిళ్లు: రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించి, సమన్వయం కుదర్చడం కోసం ఏర్పాటు చేసిన జోనల్ కౌన్సిళ్లను పునరుద్ధరించి నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది.