
కోల్ కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు వెస్ట్ బెంగాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో ఈ అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. ముర్షిదాబాద్‌లోని సుతి, సంసేర్‌గంజ్, జంగీపూర్‌లలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల వల్ల ముగ్గురు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. అల్లర్లకు కారణమైన 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు చేదాటిపోతుండటంతో కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. బెంగాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు వెంటనే కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. పరిస్థితి అదుపు తప్పుతుంటే రాజ్యాంగబద్దమైన న్యాయస్థానాలు కళ్ళు మూసుకుని ఉండలేవని హాట్ కామెంట్స్ చేసింది. ముర్షిదాబాద్‌లో స్థానికంగా అందుబాటులో ఉన్న దాదాపు 300 మంది బీఎస్ఎఫ్ సిబ్బందితో పాటు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు మరో 5 కంపెనీలను ముర్షిదాబాద్ జిల్లాలో డిప్లాయ్ చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల తర్వాత.. సుతి, షంషేర్‌గంజ్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాలలో పారామిలిటరీ దళాలను రంగంలోకి దింపారు.
బెంగాల్లో చెలరేగుతోన్న అల్లర్ల విషయంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి రాష్ట్రంలో హిందువులు సురక్షితంగా లేరని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు సీఎం దీదీ అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. కొన్ని పొలిటికల్ పార్టీస్ రాజకీయ స్వలాభం కోసం మతాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. బెంగాల్ అల్లర్లపై
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల వెనక సీఎం మమతా బెనర్జీ అసమర్థత, ఆమె బుజ్జగింపు రాజకీయాలేనని ఆరోపించారు. మమతా బెనర్జీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అన్నారు. ముస్లింలకు టీఎంసీ ప్రభుత్వం పూర్తి స్వే్చ్ఛని ఇచ్చిందని ఆరోపించారు. దీంతో వారు హిందువులపై దాడి చేయడంతో పాటు హిందు మహిళలతో దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.