బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కు నో చెప్పిన కేంద్రం

 బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది కేంద్రం.  బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ క్రమంలో మహబూబాబాద్, వరంగల్ కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఎలాంటి ముడి ఇనుము ఖనిజ నిల్వలు కేటాయించలేదని తెలిపింది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కుదరదని వెల్లడించింది.

ALSO READ | కేసీఆర్ హయాంలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యం: జితేందర్ రెడ్డి

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వీలుగా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు దాదాపు 65 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుము ఖనిజ నిల్వల కోసం 2019లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనను కేంద్ర ఉక్కు శాఖతో పాటు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ పరిశీలించాయి. తెలంగాణలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమీకృత స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పరిశీలనలో స్పష్టమైంది. ముడి ఇనుము ఖనిజ ఏరియాను రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను 2021లో రాష్ట్రానికి తిరిగి పంపించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.