విశ్లేషణ: పంచాయితీ ఆపి వడ్లు కొనాలె

బాయిల్డ్ ​రైస్ ​ఇవ్వబోమని కేంద్రానికి లెటర్​ రాసి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వడ్లు కొనాల్సింది పోయి ధర్నాలు చేస్తుండటం బాధాకరం. సమస్యకు పరిష్కారం వెతకాల్సింది పోయి.. దాన్ని పెద్దది చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. యాసంగి సీజన్​లో వడ్లను మర ఆడించడం ద్వారా నూకల తరుగు పెరిగి నష్టం వచ్చే పరిస్థితి ఉంటే.. దాన్ని పూడ్చేందుకు ఉన్న మార్గాలపై దృష్టి పెట్టాలి. అంతేగానీ పరస్పర విమర్శల వల్ల రైతులకు మేలు జరగదు. ఇప్పటికైనా పంచాయితీ ఆపి వడ్లు కొనుగోళ్లు చేపట్టాలి.

కేంద్రం వడ్లు కొనడానికి ముందుకు రావడం లేదని, దేశమంతా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. వడ్లు కొనబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని, ఇప్పటికే దేశంలో బాయిల్డ్​ రైస్​నిల్వలు ఎక్కువ ఉన్నందున, చేసుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ నుంచి రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి.. బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి. అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి. ఇదీ జరగాల్సిన ప్రక్రియ. ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ కూడా. వడ్ల నుంచి డైరెక్ట్ బియ్యం తీస్తే వాటిని రా రాస్ అంటారు. వడ్లను ఉడకబెట్టి బియ్యం చేస్తే వాటిని బాయిల్డ్ రైస్ అంటారు. రారైస్​తో పోలిస్తే ఇందులో నూకల శాతం తక్కువ. పూర్వం బాయిల్డ్ రైస్ బాగా తినేవారు. ఇప్పుడు తగ్గింది. విదేశాల్లో కూడా వీటికి డిమాండ్ లేదు. దేశంలో క్రమంగా బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గుతున్నందున.. రా రైస్ పంపించాలని ఆదేశిస్తూ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి లెటర్​ రాసింది. ఇది మినహా రైతుల గురించి కానీ వారు పండించే పంట గురించి కానీ కేంద్రం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కేవలం దేశీయ అంతర్జాతీయ మార్కెట్ లో బాయిల్డ్ రైస్ కి డిమాండ్ లేదు కాబట్టే వాటిని వద్దు అంటోంది. ఇదీ అసలైన విషయం. బాయిల్డ్ రైస్‌‌లో నూకల తరుగు శాతం ఉండదు. కాబట్టి రా రైస్ కంటే బాయిల్డ్​ రైస్​తో ప్రభుత్వానికి, రైస్ మిల్లర్లకు నష్టం ఉండదు. కేంద్రం బాయిల్డ్ రైస్ వద్దు అనేసరికి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను రైతులపై వేసింది. కేంద్రం వడ్లు కొనను అంటోందని, రైతులు వరి పెట్టొద్దని హెచ్చరించింది. కొంత మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసినా.. గత్యంతరం లేని చాలా మంది రైతులు మళ్లీ వరే పెట్టారు. ఇప్పుడు కోతల టైమ్ ​ప్రారంభమైంది. మార్కెట్​కు వడ్లు వస్తున్నా.. ప్రభుత్వం ఇంకా కొనుగోలు సెంటర్లు పెట్టకపోవడంతో రైతులకు కష్టాలు 
మొదలయ్యాయి.

లెటర్​పై సంతకం చేసి..

యాసంగిలో తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ కొనుడు వీలు కాదంటూ, నిరుడు అక్టోబర్ 4 న సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ ఎఫ్​సీఐకి లేఖ రాశారు. అందులో భాగంగానే భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆ లెటర్​పై సంతకం పెట్టింది. రాష్ట్ర పరిస్థితులు తెలిసి కూడా ప్రభుత్వం కేంద్రానికి లెటర్​రాసి ఇవ్వడంపై ఇప్పుడు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇటీవల పార్లమెంట్​లో కేంద్రమంత్రి పీయుష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మీరు రాసిన లేఖ ప్రకారం బాయిల్డ్ రైస్ కొనం.. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటాం” అని అన్నారు. కేంద్రం మెడ మీద కత్తి పెడితే సంతకం పెట్టామని చెబుతున్న సీఎం కేసీఆర్​మాటలు రాష్ట్ర రైతులను ఏ మాత్రం సంతృప్తి పరచడం లేదు. సీఎం ఆ లేఖపై సంతకం చేయకపోతే, కేంద్ర మెడలు వంచి రైతులకు న్యాయం చేసే అవకాశం ఉండేదని కాంగ్రెస్ పార్టీ అంటోంది. వడ్ల కొనుగోళ్లపై మార్చి మొదటి వారంలోపే కార్యక్రమం సిద్ధం చేసుకోవాల్సి ఉంది. కానీ ఉగాది దాటినా ఇంత వరకు ఎలాంటి అంచనాలు లేవు. 

నూకల శాతం భరించలేదా?

యాసంగిలో రారైస్‌‌‌‌‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌‌‌‌‌చేస్తే ఎండ తీవ్రతకు బియ్యం గింజ విరిగి నూక శాతం పెరుగుతుందని రాష్ట్ర సర్కారు చెబుతోంది. సాధారణంగా క్వింటాల్‌‌‌‌‌‌‌‌ ధాన్యం మిల్లింగ్‌‌‌‌‌‌‌‌చేసి 67 కిలోల బియ్యాన్ని ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. బాయిల్డ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌కు ఇది ఓకే అయినా రా రైస్‌‌‌‌‌‌‌‌కు అదనంగా10 కిలోల నూక ఎక్కువ అయ్యే చాన్స్ ఉందని మిల్లర్లు అంటున్నరు. ఈ నష్టాన్ని రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం భరించవచ్చు. ఉదాహరణకు 60 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే.. రాష్ట్ర సర్కారుకు రూ.1500 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చిన నష్టంలో నూకలను ఇథనాల్‌‌‌‌ తయారీకి వాడితే 700 నుంచి వెయ్యి కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు అంటున్నారు. ఎంత చూసినా రాష్ట్ర సర్కారుకు500 కోట్లకు మించి నష్టం ఉండదని చెబుతున్నారు. సర్కారు వడ్లు సేకరించక పోతే రైతులు అగ్గువకు వడ్లు అమ్ముకుని రూ.3 వేల కోట్లకు పైగా నష్టపోయే ప్రమాదం ఉంది. 

భూస్వాములకు రైతు బంధు కట్​చేస్తే..

రాష్ట్ర ప్రభుత్వం 61.49 లక్షల రైతులకు రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు సాయం చేస్తోంది. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందున్న రైతుల్లో చిన్న, సన్నకారు రైతులే ఉన్నప్పటికీ.. భూస్వాములు, రాజకీయ నేతలు, అధికారులు, గుట్టలు, పుట్టలకు పెద్ద ఎత్తున రైతు బంధు నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ పథకంలో నిర్ధిష్టమైన భూమి పరిమితి లేనందువల్ల, ప్రజా సొమ్ము ప్రభుత్వం ద్వారా పెద్ద వ్యక్తులకు అందుతోంది. వేల కోట్ల రూపాయలకు ప్రయోజనం లేకుండా పోతోంది. దీన్ని కట్టడి చేసి చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తే.. దాదాపు 5 వేల కోట్లకు పైగా డబ్బులు మిగిలే ఆస్కారం ఉంటుంది. ఆ మొత్తాన్ని యాసంగి సీజన్​లో నూకల ద్వారా వచ్చే నష్టానికి పూడ్చే ప్రయత్నం చేస్తే.. వడ్ల సమస్యే ఉండదు. 

నూకలు తక్కువ వచ్చే వంగడాలు లేవా..

యాసంగి సీజన్​లో తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందని, దాంతో బియ్యం పట్టిస్తే.. నూక శాతం ఎక్కువ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే మన రాష్ట్ర ఉష్ణోగ్రతను తట్టుకుని నూక శాతం తక్కువ వచ్చే వరి వంగడాలు ఉన్నాయని చాలా మంది అగ్రికల్చర్​సైంటిస్టులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కేంద్రం రా రైస్ ​తీసుకోబోమని ముందే చెప్పింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నూకలు తక్కువ వచ్చే వరి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించి ఆ రకాన్ని సాగు చేసి ఉంటే వడ్ల సమస్య వచ్చి ఉండేది కాదు.

రాజకీయ పబ్బం కోసమేనా?

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఆలోచించాలనుకుంటే వడ్ల సమస్యకు ప్రత్యామ్నాయం మార్గాలు ముందు నుంచే అన్వేషించేది. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాయిల్డ్​రైస్​ఇవ్వబోమని లెటర్​రాసి ఇచ్చి.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ధర్నాలు చేస్తుండటం చూస్తుంటే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమేనా ? అనే సందేహం రాష్ట్ర రైతుల్లో కలుగుతోంది. ఇప్పటికే యాసంగి వరికోతలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనాలి. కేంద్రానికి రారైస్​ఇవ్వడం ద్వారా వచ్చే నూకల నష్టాన్ని పూడ్చేందుకు ఉన్న మార్గాలను వెతకాలి. అప్పుడే రైతు సంక్షేమ రాజ్యంగా ప్రభుత్వానికి పేరు వస్తుంది.
- శ్రీనివాస్ తిపిరిశెట్టి, 
సోషల్‌‌ ఎనలిస్ట్