
తదుపరి విచారణ వరకు వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో నియామకాలు చేపట్టం
సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ
రిప్లై ఫైల్ చేసేందుకు వారం గడువిచ్చిన కోర్టు
తదుపరి విచారణ మే 5కు వాయిదా
న్యూఢిల్లీ: ఃవక్ఫ్ సవరణ చట్టంపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రిప్లై ఇచ్చేందుకు వారం రోజుల గడువు కావాలని విజ్ఞప్తి చేసింది. తదుపరి విచారణ వరకూ వక్ఫ్ ఆస్తులను ఢీనోటిఫై చేయబోమని, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సహా వక్ఫ్ బోర్డులలో నియామకాలు చేపట్టబోమని హామీ ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
కేంద్రం వాదనలను పరిగణనలోకి తీసుకున్న బెంచ్.. ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులను విరమించుకుంది. కానీ తదుపరి విచారణ ప్రాథమిక అభ్యంతరాలపై, మధ్యంతర ఉత్తర్వులపైనే ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్రం వివరణ ఇచ్చేందుకు వారం రోజుల టైమ్ ఇచ్చింది. కేంద్రం కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత ఐదు రోజుల్లోగా పిటిషనర్లు రీజాయిండర్లు ఫైల్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. కాగా, వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లలో ఐదింటిపైనే విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. మిగతా పిటిషన్లన్నీ ముగిసినట్టుగానే పరిగణించాలని చెప్పింది. ముగ్గురు లాయర్లను నోడల్ కౌన్సిల్‌గా నియమిస్తూ, వారిలో ఎవరు వాదిస్తారో నిర్ణయించుకోవాలని సూచించింది.
స్టే సరికాదు: కేంద్రం
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. చట్టంలోని మూడు అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని బుధవారం విచారణలో కోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం వాదన వినకుండానే స్టే ఇవ్వడం దారుణమైన చర్య అవుతుందన్నారు. చట్టంలోని కొన్ని నిబంధనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని స్టే ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. కోర్టు స్పందిస్తూ.. తాము మొత్తం చట్టాన్ని నిలిపివేయబోమని, కొన్ని అంశాలపైనే అభ్యంతరాలు ఉన్నాయని చెప్పింది. తుషార్ మెహతా వాదనలు కొనసాగిస్తూ.. వక్ఫ్ చట్టాన్ని సవరించాలని పెద్ద ఎత్తున వినతిపత్రాలు అందాయని చెప్పారు. వక్ఫ్ పేరు చెప్పి అనేక చోట్ల ప్రైవేట్ ఆస్తులను ఆక్రమించారన్నారు. ‘‘ఇప్పుడే స్టే ఇవ్వొద్దు. మేం రిప్లై ఫైల్ చేసేందుకు వారం రోజుల టైమ్ ఇవ్వండి. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను ఢీనోటిఫై చేయడం గానీ, వక్ఫ్ కౌన్సిల్ సహా వక్ఫ్ బోర్డుల్లో నియామకాలు చేపట్టడం గానీ చెయ్యం” అని హామీ ఇచ్చారు.
వక్ఫ్ బోర్డు మత సంస్థ కాదు: జగదాంబికా పాల్
వక్ఫ్ బోర్డు మతపరమైన సంస్థ కాదని గతంలో సుప్రీంకోర్టే చెప్పిందని..
వక్ఫ్ బిల్లుపై ఏర్పాటు చేసిన జేపీసీ చైర్మన్, బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ అన్నారు. ‘చట్టబద్ధమైన సంస్థ’ అని, ‘వక్ఫ్ బోర్డు చట్టబద్ధమైన, పాలనాపరమైన సంస్థ’ అని రెండు తీర్పుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్నదని తెలిపారు. అందుకే అందులో ముస్లింలు, ముస్లిమేతరులు కూడా సభ్యులుగా ఉండొచ్చన్నారు.
కేంద్రం ముస్లింలకు వ్యతిరేకం: మమతా బెనర్జీ
కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. గురువారం కోల్‌కతాలో ముస్లిం మత పెద్దల సమావేశంలో ఆమె మాట్లాడారు ‘‘మీరు (ప్రధాని మోదీ) ముస్లింలకు వ్యతిరేకం. కానీ సౌదీ అరేబియా వెళ్లినప్పుడు ముస్లింలను కలుస్తారు. దుబాయ్ వెళ్లినప్పుడు వాళ్ల ఆతిథ్యం స్వీకరిస్తారు. మీరు మన దేశంలో ఒక్కటి చెప్తారు. వేరే దేశంలో మరొకటి చెప్తారు” అని విమర్శించారు.