కేంద్రం మరో సంచలన నిర్ణయం.. భారత్‎లో పాక్ సినిమాలు, నటులపై నిషేధం

కేంద్రం మరో సంచలన నిర్ణయం.. భారత్‎లో పాక్ సినిమాలు, నటులపై నిషేధం

 న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనతో పాకిస్థాన్‎పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. 28 మంది అమాయక ప్రజల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచిన దాయాది దేశానికి తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. 1960  సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ గొంతు ఎండబెడుతున్న భారత్.. అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ కూడా మూసివేసింది. 48 గంటల్లో పాక్ పౌరులు భారత్ విడిచిపోవాలని ఆదేశించింది. అలాగే.. వారం రోజుల్లో ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయం ఖాళీ చేయాలని సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది. 

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‎లో పాక్ సినిమాలు, ఆ దేశ నటులపై నిషేధం విధించింది. ఇందులో భాగంగా పాక్ హీరో ఫవాద్ ఖాన్, భారత నటి వాణి కపూర్ నటించిన అబిర్ గులాల్ సినిమాపై బ్యాన్ విధించింది. 2025, మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు భారత కేంద్ర సమాచార  మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి నుంచి భారత్‎లో పాక్ సినిమాలు ప్రదర్శించబడవు. అలాగే.. పాక్ యాక్టర్స్ నటించిన సినిమాలు కూడా భారత్‎లో రిలీజ్ కావు. సీమాంతరం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్ పై భారత్ ఒక్కొక్కటిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని కకాలవికలం చేస్తున్నాయి. 

Also Read:-పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచులు అన్నీ రద్దు : ఎక్కడా కూడా ఆడేది లేదు

కాగా, జమ్ముకాశ్మీర్‎లోని పహల్గాం ప్రాంతం బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో పహల్గాంలో రక్తపుటేరులు పారించిన ముష్కరులు కోసం భద్రత దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.