రూ.150 లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్రం : చాడ

రూ.150 లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్రం : చాడ

కరీంనగర్‌‌, వెలుగు : కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, గతంలో రూ. 50 లక్షల కోట్లు ఉన్న అప్పును పదేండ్లలో రూ.150 లక్షల కోట్లకు చేర్చారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్పొరేట్‌‌వ్యవస్థకు కొమ్ముకాస్తోందన్నారు. 

కరీంనగర్‌‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌‌ నియోజకవర్గాల పునర్విభజన చేయడంతో పాటు జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. జమిలి ఎన్నికలంటే ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కడమేనని మండిపడ్డారు. 

బ్లాక్‌‌ మనీని వెనక్కు తీసుకొస్తానని గతంలో అనేక సార్లు చెప్పిన ప్రధాని మోదీ ఆ విషయాన్ని విస్మరించారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కౌన్సిల్‌‌ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌‌కుమార్‌‌, బోయిని అశోక్, అందె స్వామి, కసిరెడ్డి సురేందర్‌‌రెడ్డి పాల్గొన్నారు.