పరిశ్రమల కార్మికులకు కేంద్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది

 పరిశ్రమల కార్మికులకు కేంద్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది
  • పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ 
  • కార్మికులే పరిశ్రమలను.. ఉద్యోగాలను  కాపాడాలి

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరరేక విధానాన్ని అనుసరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్ విమర్శించారు. కార్మికులను, పరిశ్రమలను కాపాడుకున్నప్పుడే ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. కానీ కేంద్రం మాత్రం అన్ని వర్గాల కార్మికులను మోసం చేస్తోందన్నారు.

 ఆదివారం బాగ్ లింగంపల్లిలోని విఎస్టీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐఎన్ టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి.సంజీవరెడ్డి జన్మదినోత్సవ సభను స్థానిక యూనియన్ భవన ఆవరణలో నిర్వహించారు. ఐఎన్​టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. 

ఈ కార్యక్రమానికి మహేశ్​కుమార్ గౌడ్, కనీస వేతనాల సలహామండలి చైర్మన్ బి.జనత్ రాజ్, వీహెచ్ హనుమంతరావు, కుంతియా హాజరై సంజీవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేశ్​కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా జి.సంజీవరెడ్డి కార్మికులకు అండగా ఉంటున్నారని, వారి సమస్యలపై పోరాడుతున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న గొప్పవ్యక్తి అని కొనియాడారు. 

సంజీవరెడ్డి మాట్లాడుతూ.. తుది శ్వాస వరకు కార్మికుల అభ్యున్నతి కోసం పనిచేస్తానన్నారు. కష్టపడే కార్మికులకు సంస్థలు అండగా ఉండాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడానికి కృషి చేయాలని కోరారు. యూనియన్ ప్రతినిధులు కె.రాజు, ఎల్డీ పాల్, ఏఆర్ శ్రీనివాస్ యాదవ్, నాగేష్, కృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నాగన్న గౌడ్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.