గాయపడ్డ కాశ్మీరీల మనసేంటి?

గాయపడ్డ కాశ్మీరీల మనసేంటి?

భూతల స్వర్గం కాశ్మీర్‌‌ గాయాలు మాన్పే ఎన్నికల చికిత్సకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.  ‘ఇవన్నీ కాదు, మాకు ఎన్నికైన ప్రభుత్వం కావాలి’ అంటున్న సగటు జమ్మూ కాశ్మీర్‌‌ ప్రజల ఆకాంక్ష తీర్చే ఎన్నికల ప్రక్రియ మొదలైంది! ఆర్టికల్​370 ఎత్తివేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు.  భారత ఎన్నికల కమిషన్‌‌ జమ్మూ కాశ్మీర్‌‌లో ఇటీవల రెండోసారి పర్యటించి, క్షేత్ర సమాచారం సేకరించి ఎన్నిక‌‌ల షెడ్యూల్ ప్రకటించింది.

భద్రతపై  కేంద్రం ఇటీవల ఓ ఉన్నతస్థాయి భేటీ జరిపింది. సెప్టెంబరు మాసాంతంలోపు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్‌‌లో వచ్చే సెప్టెంబరు 18 నుంచి అక్టోబ‌‌ర్ 1 వ‌‌ర‌‌కు 3 విడ‌‌త‌‌ల్లో ఎన్నిక‌‌ల నిర్వహణకు ఈసీ తేదీలు ప్రక‌‌టించింది.  దశాబ్దాలుగా గాయాలతో  నెత్తురోడుతున్న కాశ్మీర్‌‌ అసలేం కోరుకుంటోంది?  ప్రజలేమంటున్నారు? పార్టీలు ఎలా ఉన్నాయి? జనం ఆకాంక్షలు తీర్చే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందా? ఇవీ సమాధానం రావాల్సిన ప్రశ్నలు!


కాశ్మీర్‌‌లో త్వరలో జరగబోయే ఎన్నికలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్​ 370 ఎత్తివేత సబబా, తప్పా.. అనేది  తేల్చే ప్రజాతీర్పు (రెఫరెండం) లాంటిదే!  కాశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ అధికరణాన్ని కేంద్రంలోని బీజేపీ నేతృత్వపు ఎన్డీఏ  ప్రభుత్వం ఎత్తివేసి ఇప్పటికి సరిగ్గా అయిదేండ్లు. ఆర్టికల్​ 370 కిందటి ప్రత్యేక ప్రతిపత్తి తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమేనని, దాన్ని తొలగించే అధికారం 
రాష్ట్రపతికి ఉంటుందని, కేంద్ర నిర్ణయాన్ని అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం కిందటేడు డిసెంబరులో సమర్థించింది.

ఇక ఈ అంశంపై ప్రజాకోర్టు తీర్పు రేపటి ఎన్నికల ద్వారా వెలువడనుంది. చివరిసారిగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు 2014లో జరిగాయి. అప్పుడు ఏర్పడ్డ బీజేపీ, -పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 2018 నవంబరులో రద్దయింది.  కాశ్మీర్‌‌ రాష్ట్రపతి పాలనలోకి వచ్చింది. ఆగస్టు 2019లో ఆర్టికల్​ 370 రద్దవడంతో  కాశ్మీర్‌‌ రాష్ట్ర హోదా కోల్పోవడమే కాక జమ్మూ -కాశ్మీర్‌‌, లడక్‌‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలన లేకుండా పోయింది. 

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో,  లెఫ్టినెంట్‌‌ గవర్నర్‌‌ కింద, అధికారుల పాలనే ఇప్పటికీ కొనసాగుతోంది. దీని పట్ల ప్రజల్లో అసంతృప్తి  బలపడుతోంది. ఉన్నతస్థాయి అధికారుల్లో యాభై శాతానికి మించి బయటివారే అనేది జనాగ్రహం.  రాష్ట్ర హోదా -జాప్యంతో  నిమిత్తం లేకుండానే ఎన్నికలు జరిపి తీరాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా వాటిని వెంటనే నిర్వహించాల్సిన అత్యవసరం ఏర్పడింది.  ఈ పరిస్థితుల్లోనే ‘పీపుల్స్‌‌పల్స్‌‌’ సర్వే సంస్థ క్షేత్ర అధ్యయనం చేస్తోంది. ఇంతలో  కాశ్మీర్‌‌లో ఎన్నికల నగారా మోగింది.

ప్రజాభిప్రాయమే గీటురాయి

ఎన్నికలు, తద్వారా ఏర్పడే ప్రజాప్రభుత్వాన్ని కాశ్మీరీలు కోరుకుంటున్నారు. చరిత్రలో తరచూ ఎన్నికల బహిష్కరణకు మొగ్గే ఇక్కడి ప్రజలు, అనూహ్యంగా ఎన్నికల్లో స్వచ్ఛందంగా పొల్గొన్నారు.  ఇటీవల ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 58 శాతం పోలింగ్‌‌ నమోదు చేశారు. దీనికి దీటుగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల నిర్వహణ ద్వారా మాత్రమే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ఆలోచనా విధానమైనా, ఎన్నికలను చూసే దృష్టి అయినా జమ్మూ ప్రాంత ప్రజలు, కాశ్మీర్‌‌ లోయవారికి లోగడ కొంత భిన్నంగా ఉండేవారు.

కానీ, ఇప్పుడు అంతా ఒకే రీతిన ఆలోచిస్తున్నట్టు జనక్షేత్రంలో పర్యటిస్తున్న ‘పీపుల్స్‌‌పల్స్‌‌’ పరిశీలకుల దృష్టికి వచ్చింది. అధికారుల పాలన బాగోలేదంటున్నారు. సమస్యలు జటిలమౌతున్నాయి తప్ప పరిష్కారాలు లభించడం లేదనే భావన ఉంది.  ప్రజాప్రతినిధుల  వ్యవస్థ లేక పాలనలో ప్రజల భాగస్వామ్యం కొరవడింది.  జిల్లా అభివృద్ధి మండళ్లు (డీడీసీ), బ్లాక్‌‌ అభివృద్ధి మండళ్ల (బీడీసీ) వ్యవస్థతో  మేలేమీ లేదనే పెదవి విరిచింది.

ప్రజలకు నమ్మిక కలిగించేందుకు, వారి వినతుల స్వీకరణకు లెఫ్టినెంట్​ గవర్నర్‌‌ ‘ఆమ్‌‌ కీ అవాజ్‌‌’ కార్యక్రమం పెట్టినా, ‘బ్యాక్‌‌ టు విలేజ్‌‌’ వంటి ప్రోత్సాహక చర్యలు చేపట్టినా ప్రజలు అంతగా సంతృప్తి చెందడం లేదు.  కేంద్రం చెప్పే అభివృద్ది మిథ్య అని, కొత్తగా తెచ్చిన ‘డొమిసిల్‌‌ లాస్‌‌’ వల్ల స్థానికతకు భంగం కలగటమేకాక కాశ్మీరీల భూములు బయటివారి పాలయ్యే ప్రమాదాన్ని స్థానికులు శంకిస్తున్నారు. పెట్టుబడులతో ప్రయివేటురంగం విస్తరించని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తోంది. ఇదొక పెద్ద సమస్య! నిరుద్యోగిత దేశ సగటు (6.6 శాతం) కన్నా కాశ్మీర్‌‌లో అత్యధికంగా (10.7 శాతం) ఉండటం చదువుకున్న యువతలో అశాంతిని రేపుతోంది.

ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే సంకేతాలు లేవు

370 ఆర్టికల్​ రద్దు దరిమిలా... బీజేపీ పట్ల, దానితో అంటకాగుతున్న పార్టీల పట్ల ప్రజల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకతకు నిన్నటి ఫలితాలు ఒక నిదర్శనం. లోక్‌‌సభ ఎన్నికల్లో ఓట్ల సరళిని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విశ్లేషించినపుడు, ఇది మరింత స్పష్టమౌతోంది. ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే సంకేతాలు లేవు.  కిందటి (2014) ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి, సంకీర్ణ సర్కారులో ప్రధాన భాగస్వామిగా ఉన్న పీపుల్స్‌‌ డెమోక్రటిక్‌‌ పార్టీ (పీడీపీ)కి నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే ఆధిక్యత దక్కింది.

బీజేపీకి 29 చోట్ల,  కాంగ్రెస్‌‌కు 7 చోట్ల ఆధిక్యత దక్కగా ఎన్సీ 36 చోట్ల ఆధిక్యత పొందింది. 2014 ఎన్నికల్లో 15 సీట్లు గెలిచిన ఎన్సీ, ఈసారి ఎక్కువ సీట్లు గెలిచి, ‘ఇండియా’కూటమిలో కీలకపాత్ర పోషించవచ్చు. కిందటి ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌‌ పరిస్థితి ఈసారి మెరుగుపడొచ్చు! 

లోక్‌‌సభలో ప్రస్తుత విపక్షనేత రాహుల్‌‌

గాంధీ, లోగడ కన్యాకుమారి నుంచి చేపట్టిన ‘భారత్‌‌ జోడో’యాత్రను కాశ్మీర్‌‌లో ముగించినపుడు లభించిన ప్రజాదరణ దృష్ట్యా పార్టీ ఇక్కడ ఆశావహంగా ఉంది. ఇద్దరు తెలుగు నేతలు, ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ ముఖ్యుడైన రామ్‌‌మాధవ్‌‌, నాటి బీజేపీ నాయకుడిగా 2014 ఎన్నికల్లో, తదనంతరం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తే, ఇప్పుడు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధినేత కిషన్‌‌రెడ్డి  కాశ్మీర్‌‌ ఇంచార్జీగా రేపటి ఎన్నికల్లో ముఖ్యభూమిక పోషించనున్నారు.స్థానిక నాయకుల నుంచి ఢిల్లీ పెద్దల దాకా ఎవరి పాత్ర ఎంతున్నా... కాశ్మీరీల మనోభావాలే జమ్మూ- కాశ్మీర్‌‌ భవిష్యత్తును లిఖిస్తాయి.

శాంతి భద్రతలే సవాల్‌‌!

కాశ్మీర్‌‌లో ఉగ్రవాదం దృష్ట్యా శాంతిభద్రతల పరిస్థితిని ఎలా కొలవాలి? అన్నదెప్పుడూ మీమాంసే!  ఇదివరకు కాశ్మీర్‌‌ లోయ, సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైన ఉగ్రవాద చర్యలు, హింస ఇటీవల జమ్మూతో సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. దాడులు, ఇతర హింసాత్మక చర్యలు ఇటీవల కాలంలో పూంచ్‌‌, రజౌరీ, దోడ తదితర ప్రాంతాల్లోనూ చోటుచేసుకున్నాయి. లోగడ 
ఈ పరిస్థితి లేదు.

రిటైర్డ్‌‌ జడ్జీలు, విశ్రాంత  సైనికాధికారులు, ఇతర విద్యావంతులతో కూడిన బృందమొకటి ఇటీవల జమ్మూ కాశ్మీర్​లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ‘మానవ హక్కుల’పై అధ్యయన నివేదిక విడుదల చేసింది. ఉగ్రవాద చర్యలు పెరిగినట్టు నివేదికలో నొక్కిచెప్పింది. ఏడాది కాలంలో సాధారణ పౌరుల మీద తీవ్రవాదుల దాడి సంఘటనలు పెరిగి, సుమారు పాతిక ఘటనలు నమోదయ్యాయి. పౌరుల మీద ‘ఉపా’ వంటి ఉగ్రవాద చట్టాల కింద నమోదు చేసే కేసుల సంఖ్య కూడా రమారమి (2020-2023 లో 2700) పెరిగినట్టు నివేదికలో  పేర్కొన్నారు.

శాంతి భద్రతలే సవాల్‌‌!

కాశ్మీర్‌‌లో ఉగ్రవాదం దృష్ట్యా శాంతిభద్రతల పరిస్థితిని ఎలా కొలవాలి? అన్నదెప్పుడూ మీమాంసే!  ఇదివరకు కాశ్మీర్‌‌ లోయ, సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైన ఉగ్రవాద చర్యలు, హింస ఇటీవల జమ్మూతో సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. దాడులు, ఇతర హింసాత్మక చర్యలు ఇటీవల కాలంలో పూంచ్‌‌, రజౌరీ, దోడ తదితర ప్రాంతాల్లోనూ చోటుచేసుకున్నాయి. లోగడ 
ఈ పరిస్థితి లేదు.

రిటైర్డ్‌‌ జడ్జీలు, విశ్రాంత  సైనికాధికారులు, ఇతర విద్యావంతులతో కూడిన బృందమొకటి ఇటీవల జమ్మూ కాశ్మీర్​లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ‘మానవ హక్కుల’పై అధ్యయన నివేదిక విడుదల చేసింది. ఉగ్రవాద చర్యలు పెరిగినట్టు నివేదికలో నొక్కిచెప్పింది. ఏడాది కాలంలో సాధారణ పౌరుల మీద తీవ్రవాదుల దాడి సంఘటనలు పెరిగి, సుమారు పాతిక ఘటనలు నమోదయ్యాయి. పౌరుల మీద ‘ఉపా’ వంటి ఉగ్రవాద చట్టాల కింద నమోదు చేసే కేసుల సంఖ్య కూడా రమారమి (2020-2023 లో 2700) పెరిగినట్టు నివేదికలో  పేర్కొన్నారు.

- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్, 
పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ