తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక.. నిజామాబాద్​లో పసుపు బోర్డు

  • నేడు వర్చువల్​గా ప్రారంభించనున్న గోయల్, అర్వింద్
  • బోర్డు చైర్మన్​గా పల్లె గంగారెడ్డి..  ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ

న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్​లో జాతీయ పసుపు బోర్డు మంగళవారం ప్రారంభం కానున్నది. ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్​గా ఈ బోర్డును ప్రారంభించనున్నారు.  కార్యక్రమంలో గోయల్​తో పాటు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పాల్గొంటారు. బోర్డు చైర్మన్​గా నిజామాబాద్​జిల్లా అంకాపూర్ ​వాసి, బీజేపీ సీనియర్​ నేత పల్లె గంగారెడ్డిని కేంద్రం నియమించింది.ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి సంబంధించి తెలుగులో రూపొందించిన ఆహ్వాన పత్రికను ఎంపీ అర్వింద్ ఆఫీసు సోమవారం మీడియాకు విడుదల చేసింది. 

కాగా.. తనను ఎంపీగా గెలిస్తే నిజామాబాద్ కు పసుపు బోర్డు ను తెస్తానంటూ 2019 ఎంపీ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ రైతులకు హామీ ఇచ్చారు.  స్థానిక రైతులు పూర్తి మద్దతు ఇవ్వడంతో  సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై అర్వింద్ ఘన విజయం సాధించారు. నాలుగేండ్ల తర్వాత తొలిసారి  2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటుపై బహిరంగ ప్రకటన చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే అక్టోబర్ 3న గెజిట్ నోఫికేషన్ ను కేంద్రం రిలీజ్ చేసింది. కానీ నేషనల్ టర్మరిక్ బోర్డును ఎక్కడ పెడతారన్న దానిపై గెజిట్ లో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో  బోర్డు ఏర్పాటుపై స్పష్టత రాలేదు. సోమవారం నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది.

పసుపు రైతుకే చైర్మన్​ పదవి  

జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా బీజేపీ సీనియర్ నేత, పసుపు రైతు పల్లె గంగా రెడ్డి ని కేంద్రం నియమించింది. ఈ పదవిలో గంగారెడ్డి మూడేండ్లపాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించింది.  కాగా, ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డి రైతు కుటుంబానికి చెందినవారు. ఆయన నిజామాబాద్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ గా సేవలందించారు. ఏపీ సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. పల్లె గంగా రెడ్డి  ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర సెక్రటరీ పదవిలో కొనసాగుతున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన ఆయన.. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలోనే ఉంటున్నారు. 

సంక్రాంతి కానుకగా పసుపు బోర్డు: కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాలతోపాటు యావద్దేశానికి కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా పసుపు బోర్డును అందిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నేటి నుంచి పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని వెల్లడించారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని, గ్రామాల్లో జరిగే వేడుక అన్నారు. ఢిల్లీలో తొలిసారిగా తన అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు.