ప్రయాణికుల కష్టాలకు చెక్ .. త్వరలోనే పనులు ప్రారంభం

  • అధికారుల నిర్లక్ష్యంతో డేంజర్ గా ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ లింక్ ​రోడ్డు
  •  రెండు నేషనల్ హైవేలు కలిసే చోట గ్రేడ్ సపారేటర్ కట్టని వైనం 
  •  దీంతో తరచూ జాతీయ రహదారిపై ప్రమాదాలు 
  •  రాయినిగూడెం వద్ద ఫ్లై ఓవర్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం 

సూర్యాపేట, వెలుగు:  ఖమ్మం నుంచి హైదరాబాద్‌‌ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. టేకుమట్ల -– రాయినిగూడెం మధ్య ఫ్లై ఓవర్‌‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌‌ –విజయవాడ 65వ నంబర్‌‌ జాతీయ రహదారిలో టేకుమట్ల గ్రామం దాటిన తర్వాత ఖమ్మంకు కొత్త రోడ్డు నిర్మించారు. అయితే ఖమ్మం నుంచి హైదరాబాద్‌‌ వచ్చే వాహనాలు ఈ హైవేను దాటేందుకు సూర్యాపేట వైపు రాయినిగూడెం వరకు సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్‌‌ తీసుకోవాల్సి వస్తున్నది. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్ మంజూరు చేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ త్వరలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించనుంది. 

గ్రేడ్ సేపరేటర్ లేకుండానే కలిపేసిన్రు..

కేంద్ర ప్రభుత్వం భారత్ మాలలో భాగంగా ఖమ్మం –- సూర్యాపేట హైవేను రూ.1560 కోట్లతో 59 కిలో మీటర్లు నిర్మించారు. 2019 డిసెంబర్ లో రహదారి పనులు ప్రారంభం కాగా, గతేడాది సెప్టెంబర్ లో ఈ రహదారిని ప్రారంభించారు. అయితే అత్యంత కీలకమైన గ్రేడ్ సేపరేటర్ చేయకపోవడం ఇబ్బందిగా మారింది. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ మాన్యువల్ ప్రకారం రెండు జాతీయ రహదారులను గ్రేడ్ సేపరేటర్ ద్వారా కలపాలన్న రూల్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం గ్రేడ్ సేపరేటర్ తప్పనిసరి చేశారు. కానీ సూర్యాపేట -– ఖమ్మం జాతీయ రహదారి కలిసే చోట గ్రేడ్ సేపరేటర్ నిర్మించకుండా అధికారులు పాత హైవే లోనే కలిపారు. దీంతో ప్రయాణికులు ప్రమాదాల మారిన పడుతున్నారు. 

రాయినిగూడెం వద్ద ఫ్లై ఓవర్ మంజూరు..

హైదరాబాద్– -విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల –- రాయినిగూడెం మధ్యలో ప్లై ఓవర్ మంజూరు చేస్తూ కేంద్రమంత్రి నితిన్‌‌ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. నేషనల్ హైవే 65పై ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టేకుమట్ల ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 

అధికారుల తప్పిదంతో ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లై ఓవర్ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో పలుచోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని ఇటీవల మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. గ్రేడ్ సేపరేటర్ ద్వారా హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రయాణికులకు ఇక కష్టాలు తీరనున్నాయి.