
- స్టాంప్ డ్యూటీ తక్కువ.. ప్రాపర్టీ ట్యాక్స్‌లో రిబేట్
- తక్కువ వడ్డీకే హోమ్ లోన్
- ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రూ.2.67 లక్షల వరకు సబ్సిడీ
న్యూఢిల్లీ: చాలా మందికి ఇల్లు కొనుక్కోవడం జీవిత ఆశయం. ఇందుకోసం డబ్బులు కూడేస్తారు. మీ భార్య పేరు మీద ఇల్లు కొంటే కొన్ని అదనపు ప్రయోజనాలు పొందొచ్చని మీకు తెలుసా? మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక మినహాయింపులను అందిస్తోంది. వీరి కోసం సపరేట్‌గా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రాపర్టీ ట్యాక్స్‌పై రిబేట్ కూడా ఇస్తున్నాయి.
హోమ్ లోన్లపై రిలీఫ్
మగవారితో పోలిస్తే మహిళలకు 0.05 శాతం నుంచి 0.1 శాతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్లను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందిస్తున్నాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మొదటిసారిగా ఇల్లు కొనాలనుకునే మహిళలకు రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. వీటితో పాటు సెక్షన్ 80 సీ కింద హోమ్ లోన్‌లోని అసలు చెల్లింపుపై రూ.1.5 లక్షల వరకు, సెక్షన్ 24(బీ) కింద వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
తగ్గనున్న స్టాంప్ డ్యూటీ భారం..
ఇల్లు కొనేటప్పుడు చాలా పేపర్ వర్క్ ఉంటుంది. ఇంటిని రిజిస్టర్ చేయాలి. ఈ టైమ్‌లో స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో మగవారితో పోలిస్తే మహిళలపై తక్కువ స్టాంప్ డ్యూటీ వేస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీలో మగవారిపై 6 శాతం స్టాంప్ డ్యూటీ పడితే, మహిళలపై 4 శాతం వేస్తున్నారు. అలానే హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రల్లో మహిళలపై మగవారితో పోలిస్తే ఒకటి రెండు శాతం తక్కువ స్టాంప్ డ్యూటీ పడుతోంది.
ప్రాపర్టీ ట్యాక్స్‌పై రిబేట్..
ప్రతీ ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇల్లు మహిళల పేరు మీద ఉంటే ఈ ట్యాక్స్‌లో కొంత మొత్తాన్ని రిబేట్‌గా తిరిగి పొందొచ్చు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రాపర్టీ ట్యాక్స్‌లో 5 శాతం రిబేట్ ఇచ్చింది. పుణె మున్సిపల్ కార్పొరేషన్ కూడా రిబేట్ అందించింది. రాష్ట్రాలను బట్టి మున్సిపల్ కార్పొరేషన్లు ఆఫర్ చేస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ రిబేట్ మారుతుంది.
మహిళలు ఇల్లు కొనడం పెరుగుతోంది
హైదరాబాద్, ముంబై, నవీ ముంబై, థాణె, పూణె, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, బెంగళూరులో మహిళలు ఇండ్లు కొనడం పెరిగింది. వీరి పేరు మీద ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 2024 లో ఏడాది లెక్కన 14 శాతం పెరిగి 1.29 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. 2023 లో ఈ నెంబర్ 1.14 లక్షల యూనిట్లుగా ఉంది. కిందటేడాది ఈ సిటీల్లో మొత్తంగా 5.77 లక్షల ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరగగా, ఇందులో మహిళల పేరు మీద ఉన్న ట్రాన్సాక్షన్ల వాటా 22 శాతానికి పెరిగింది.
అంతకు ముందు ఏడాదిలో 20 శాతంగా ఉండేది. మగవారి పేరు మీద ఉన్న ఇండ్ల ట్రాన్సాక్షన్లు 2023 లో 1.96 లక్షలు ఉంటే, 2024 లో 2.18 లక్షలకు పెరిగాయి. 11 శాతం గ్రోత్ నమోదయ్యింది. మొత్తం ట్రాన్సాక్షన్లలలో వీరి వాటా 38 శాతంగా ఉంది. జాయింట్ (ఇద్దరి పేరు మీద) ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు మాత్రం 2023 లో 2.47 లక్షలుగా ఉంటే, 2024 లో 2.30 లక్షలకు తగ్గాయి. ఏడు శాతం పడ్డాయి.