న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ–ఏపీని కలిపే కీలకమై న నేషనల్ హేవే 565 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ టౌన్ బైపాస్కు సం బంధించిన 4 లేన్ల రహదారి నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ సెక్షన్ వరకు కలిపే 14 కి.మీ నేషనల్ హైవే శాంక్షన్ చేసినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో నేషనల్ హేవే 565, ఏపీలో 30 స్టేట్ రోడ్స్, గోవాలో ఎన్ హెచ్ 748 విస్తరణ, మహారాష్ట్రలో పలు రోడ్లకు సంబధించిన అభివృద్ధి అంశాలను పంచుకున్నారు.
ఇందులో తెలంగాణలో ఎన్ హెచ్– 565లోని నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు నల్గొండ టౌన్ కోసం 14 కి.మీ పొడవు... 4-లేన్ బైపాస్ నిర్మాణానికి రూ. 516 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్ హెచ్ –565 తెలంగాణ– ఏపీలను కలిపే కీలకమైన జాతీయ రహదారిగా వెల్లడించారు. ఈ రూట్ తెలంగాణలోని నకిరేకల్ వద్ద ఉన్న ఎన్ హెచ్– 65 జంక్షన్ నుంచి ప్రారంభమై నల్గొండ– మాచర్ల– ఎర్రగొండపాలెం – కనిగిరి పట్టణాల మీదుగా వెళుతుందని వివరించారు. కేంద్ర తీసుకున్న ఈ కొత్త ప్రాజెక్ట్ నల్గొండలో ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా..నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని వెల్లడించారు. అలాగే రహదారి భద్రతను పెంచుతుందని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి థ్యాంక్స్
బైపాస్ రోడ్డు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు బైపాస్ రోడ్డు ఎంతో కీలకమైనదని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల నల్గొండ టౌన్లో ట్రాఫిక్ తగ్గడమే కాకుండా, రహదారి భద్రతను మెరుగుపరచడం, నకిరేకల్, నాగార్జున సాగర్ మధ్య మెరుగైన కనెక్టివిటీకి దోహదం చేస్తుందని మంత్రి ట్వీట్ చేశారు.