
- ఇంటి నుంచి తెచ్చుకుంటున్న బాటిళ్లలో నీళ్లే దిక్కు
- ఎక్కడా కనిపించని నీడ సౌకర్యం
- మండే ఎండల్లోనూ ఫస్టెయిడ్ ముచ్చటే లేదు
ఆసిఫాబాద్, వెలుగు: వలసలు నివారించి కూలీలకు పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద నీటి కుంటలు, ఊట కుంటలు, భూమి చదును, పొలాలకు కట్టలు తదితర పనులు చేపడుతున్నారు. కూలీలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం టెంట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు తదితర సామగ్రిని అందజేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వాటి జాడ కనిపించడం లేదు. జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఉపాధి పని ప్రదేశంలో ఎక్కడా ఆ సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం తాగు నీరు, ఎండ నుంచి తట్టుకునేలా టెంట్లు, అనుకోని ప్రమాదం జరిగినా, ఎండదెబ్బ తగిలినా కనీసం ఫస్టెయిడ్ కిట్ కూడా అందుబాటులో ఉంచడం లేదు. దీంతో కూలీలు ఎండకు అల్లాడుతూనే పనిచేస్తున్నారు.
లక్షా 23 వేల జాబ్ కార్డులు..
ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాల్లో లక్షా 23 వేల జాబ్ కార్డులున్న కుటుంబాలుండగా.. ఇందులో 2 లక్షల 44 వేల మంది సభ్యులున్నారు. యాక్టివ్ జాబ్ కార్డ్స్ 92 వేలు, యాక్టివ్ కూలీలు లక్షా 71 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న జాబ్ కార్డులు 76 వేలు కాగా.. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు లక్షా 32 వేల మంది. అయితే వీరంతా మండుటెండల్లోనే పనిచేస్తున్నారు. కౌటాల మండలం శివలింగాపూర్ శివారులో జరుగుతున్న పని ప్రదేశంలో పరిశీలించగా కూలీలకు తాగునీరు కూడా అందుబాటులో లేదు. టెంట్, గ్రీన్ మ్యాట్‌తో వేయాల్సి ఉండగా అధికారులు ఆ ఏర్పాట్లేమీ చేయలేదు. ఇంటినుంచి పొద్దున తెచ్చుకుంటున్న నీళ్లే వారికి దిక్కు.
సౌకర్యాలు కల్పించేలా చర్యలు
ఉపాధి హామీ పథకం లో పనులు చేస్తున్న కూలీలకు సౌకర్యాలు కల్పించాలని పంచాయతీ సెక్రటరీ లను ఆదేశించం.గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీ పరిధిలోనే పంచాయతీ సెక్రటరీ లు కూలీలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పినం. – దత్తరామ్, డీఆర్డీవో, ఆసిఫాబాద్
బాటిళ్లలో నీళ్లు వేడెక్కి తాగలేకపోతున్నం
నేను మూడు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి పనిచేస్తున్నా. ఇంటి నుంచి నీళ్ల బాటిల్ తెచ్చుకుంటున్న. ఎండకు ఈ నీళ్ల వేడి అవుతుండడంతో తాగలేకపోతున్నం. కనీసం చల్లటి నీళ్లు, టెంట్ సౌకర్యం కల్పిస్తే మంచిగుండు.
మానేపల్లి భూమక్క, ఉపాధి హామీ కూలీ, కౌటాలమస్తు తక్లీబ్ అవుతోంది
ఉపాధి హామీ పనులు చేసే చోట తాగడానికి మంచి నీళ్లు లేక మస్తు తక్లీబ్ అవుతోంది. ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్ నీళ్లు సరిపోతలెవ్. నీడ కోసం టెంట్ లేదు. ఏదైనా ప్రమాదం, వడదెబ్బకు గురైతే కనీసం మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచడం లేదు. అసౌకర్యాల నడుమ ఉపాధి హామీ పనులు చేయాల్సి వస్తోంది. ఆపీసర్లు స్పందించి పని జాగాలో సౌలత్ లు కల్పించాలి.
పెందోర్ శేఖర్, ఉపాధి కూలీ, చింతపల్లి, తిర్యాణి