- దిగుమతి సుంకం 27.5%కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు
- 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి
- కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు మంత్రి తుమ్మల థ్యాంక్స్
హైదరాబాద్, వెలుగు: విదేశాల నుంచి దిగుమతి అయ్యే ముడి పామ్ ఆయిల్ పై సుంకాన్ని 5.5 % నుంచి 27.5 % కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్ర అయిల్ పామ్ రైతులకు భారీ ఊరట లభించినట్లయ్యింది.
దిగుమతి సుంకం తగ్గిస్తే..పామ్ ఆయిల్గెలల ధరలు తగ్గడమే కాకుండా రైతుల సాగుకు ఉత్సాహం తగ్గుతుంది. అందుకే రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి దిగుమతి సుంకాన్ని పెంచి రైతులను ఆదుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు ఆయిల్ పామ్ రైతుల సమస్యను వివరించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చే ముడి పామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేస్తే గెలల ధర తగ్గి సాగుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని తుమ్మల వివరించారు.
మంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి చౌహాన్తీసుకున్న చొరవతో ..ముడి పామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 % నుంచి 27.5 % కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ఫలితంగా ప్రస్తుతం టన్నుకు రూ. 14,392 గా ఉన్న ఆయిల్ పామ్ గెలల ధర.. టన్నుకు కనీసంగా రూ. 1500- నుంచి రూ. 1700- వరకు పెరిగి రూ.16,500 దాటే అవకాశం ఉందని మంత్రి తుమ్మల తెలిపారు.
రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి రాష్ట్ర పామ్ ఆయిల్ రైతుల తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఙతలు తెలిపారు.