- అదనంగా 40 శాతం ఎక్స్‌పోర్ట్ డ్యూటీ
- ఎన్నికల ముందు మహారాష్ట్రలోని రైతుల ఆదాయాలు పెంచేందుకు!
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతులపై బ్యాన్‌ను తొలగించింది. ఎగుమతి చేసే ఉల్లిపాయల ధరను కనీసంటన్నుకు 550 డాలర్లు (రూ.45,650 ) గా నిర్ణయించింది. ఉల్లిపాయలు ఎక్కువగా పండే మహారాష్ట్రలో త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు రైతుల ఆదాయాలను పెంచేందుకు కేంద్రం ఉల్లిపాయల ఎగుమతులపై బ్యాన్‌ను తొలగించిందని ఎనలిస్టులు చెబుతున్నారు.
ప్రభుత్వం మినిమమ్ ఎక్స్‌పోర్ట్ ప్రైస్ (ఎంఈపీ)ను టన్నుకు 550 డాలర్లుగా నిర్ణయించింది. 40 శాతం ఎక్స్‌పోర్ట్ డ్యూటీని కూడా కలుపుకుంటే, ఎగుమతి చేసే ఉల్లి పాయల ధర టన్నుకు 770 డాలర్లు (రూ. 64 వేలు) (కేజీకి రూ.64 ) కంటే దిగువన ఉండకూడదు. ఉల్లిపాయల కొరత ఏర్పడకుండా ఉండేందుకు కిందటేడాది డిసెంబర్ 8న వీటి ఎగుమతులపై ప్రభుత్వం బ్యాన్ పెట్టింది.
కాగా, గత నాలుగైదేళ్లు చూసుకుంటే ఏడాదికి 17 లక్షల టన్నుల నుంచి 25 లక్షల టన్నుల ఉల్లిని ఇండియా ఎగుమతి చేస్తోంది. బ్యాన్ ఎత్తేయడం వలన ఉల్లి రేట్లు పెరగవని కన్జూమర్ అఫైర్స్ సెక్రెటరీ నిధి ఖారే అన్నారు. ధరలు స్టేబుల్‌గా ఉంటాయని, ఒకవేళ పెరిగినా కొద్దిగానే పెరుగుతాయని వివరించారు. వినియోగదారులు, రైతులను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల కోసమే!
ఉల్లిపాయలను ఎక్కువగా పండించే మహారాష్ట్రలోని నాసిక్, అహ్మద్‌నగర్, సోలార్‌పూర్ ప్రాంతాల్లో త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మహారాష్ట్ర రైతులను పట్టించుకోవడం లేదని, ఉల్లి ఎగుమతులపై బ్యాన్‌తో రైతులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాజాగా ఎలక్షన్స్ కంటే ముందు ఉల్లి ఎగుమతులపై బ్యాన్ ఎత్తేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బ్యాన్ ఎత్తేయడంతో ఈ ప్రాంతాల్లోని రైతులు తమ పంటలపై మంచి ధరలను పొందడానికి వీలుంటుంది. ‘సప్లయ్ సమస్యలు తొలగిపోయాయి. రిటైల్ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు నిలకడగా ఉన్నాయి. అందుకే ఎగుమతులపై బ్యాన్‌ను ఎత్తేస్తున్నాం’ అని నిధి పేర్కొన్నారు. కిందటి నెలలో నాసిక్‌లోని లాసల్‌గావ్ మండీలో కేజీ ఉల్లి ధర రూ.15 పలికింది. రబీ సీజన్‌లో 191 లక్షల టన్నుల ఉల్లిపాయలు అందుబాటులోకి వస్తాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని తాజా నిర్ణయం తీసుకున్నామని నిధి వివరించారు.
గ్లోబల్‌గా ఉల్లిపాయల సప్లయ్‌ను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. దేశంలో నెలకు 17 లక్షల టన్నుల ఉల్లిపాయలు అవసరమవుతున్నాయి. ‘సాధారణ వర్షపాతం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఉల్లిపాయల ఎగుమతులపై బ్యాన్ ఎత్తేయడంతో మరింత మంది రైతులు వీటిని పండిస్తారు’ అని నిధి ఖారే వివరించారు. మహారాష్ట్రలో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, ఎక్స్‌పర్ట్‌లను సంప్రదించాకనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రభుత్వం 5 లక్షల టన్నుల ఉల్లిపాయల నిల్వలను మెయింటైన్ చేస్తోందని, ధరలు పెరిగితే జోక్యం చేసుకుంటుందని పేర్కొన్నారు. 2023–24 లో 254.73 లక్షల టన్నుల ఉల్లిపాయల ప్రొడక్షన్ జరిగింది. ఇది అంతకు ముందు ఏడాదిలో ఉత్పత్తి అయిన 302.08 లక్షల టన్నుల కంటే తక్కువ.