జనపనార మద్దతు ధర6శాతం పెంపు

జనపనార  మద్దతు ధర6శాతం పెంపు
  • ముడి జనపనారకు ఎంఎస్పీ పెంపు
  • 6శాతం హైక్ చేసిన కేంద్ర మంత్రివర్గం

న్యూఢిల్లీ:ముడి జనపనార పంట కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. క్వింటాల్ మీద 6 శాతం పెంచుతున్నట్లు ప్రకటిం చింది. 2025–26 మార్కెటింగ్ సీజన్​లో క్వింటాల్ ముడి జనపనార ధరను రూ.5,650గా నిర్ణయించింది.

ఈ లెక్కన క్వింటాల్ మీద రూ.315 పెంచినట్లైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ అయ్యింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. 

వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సూచనలు, సిఫార్సుల మేరకు ముడి జనపనార మద్దతు ధరను 6 శాతం పెంచేందుకు మంత్రివర్గం ఆమోదించిందన్నారు. 2014–15 మార్కెటింగ్ సీజన్​లో క్వింటాల్ ముడి జనపనార కనీస మద్దతు ధర రూ.2,400 ఉండేదన్నారు. 

2025–26 నాటికి రూ.5,650కు చేరుకున్నదని తెలిపారు. తమ హయాంలో ధర 2.35 రెట్లు పెరిగిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు 66.8 శాతం రాబడిని ఇస్తుందని తెలిపారు. 

దాదాపు 40 లక్షల మందికి లబ్ధి చేకూరునున్నదన్నారు. సుమారు 4 లక్షల మంది కార్మికులు జూట్ మిల్లుల్లో ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నట్లు వివరించారు. 2014–15 నుంచి 2024–25 మధ్య కాలంలో జనపనార సాగు చేసే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం రూ.1,300 కోట్లు అని చెప్పారు. 

2004–05 నుంచి 2013–14 మధ్య కాలంలో చెల్లించిన మొత్తం కేవలం రూ.441 కోట్లేనని పీయూష్ గోయల్ తెలిపారు. అదేవిధంగా, నేషనల్ హెల్త్ మిషన్‌‌‌‌‌‌‌‌ (ఎన్​హెచ్ఎం) మరో ఐదేండ్ల పాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు వివరించారు. 

గత 10 ఏండ్లలో ఆరోగ్య మిషన్ చరిత్రాత్మక లక్ష్యాలను సాధించిందన్నారు. 2021–2022 మధ్య సుమారు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు నేషనల్ హెల్త్ మిషన్​లో చేరారని తెలిపారు. ఈ మిషన్ కింద కరోనా మహమ్మారిపై పోరాడామని కేంద్ర మంత్రి గోయల్ గుర్తు చేశారు.