స్టేట్​లో రూ. 25 కోట్లతో మరో ట్రైబల్ మ్యూజియం .. నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్రం

స్టేట్​లో రూ. 25 కోట్లతో మరో ట్రైబల్ మ్యూజియం .. నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ట్రైబల్ వీరుల చరిత్రను భావితరాలకు అందించేందుకు రాష్ర్టంలో మరో ట్రైబల్ నిర్మాణం జరుగుతున్నది. ఇప్పటికే మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో  మ్యూజియం ఉండగా..ప్రస్తుతం రూ. 25 కోట్ల కేంద్ర నిధులతో అబిడ్స్ లోని 5 ఎకరాల్లో మరో మ్యూజియాన్ని ట్రైబల్ శాఖ నిర్మిస్తున్నది. దేశ వ్యాప్తంగా 10 మ్యూజియాలను శాంక్షన్ చేయగా తెలంగాణకు ఒకటి శాంక్షన్ అయిందని అధికారులు చెబుతున్నారు.

 మొత్తం ఐదు ఫ్లోర్లుకాగా.. అందులో 3 ఫ్లోర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సోమవారం మ్యూజియం పనులను స్టేట్ ట్రైబల్ ఆఫీసర్లు సముజ్వల, సత్యనారాయణలతో కలిసి కేంద్ర ట్రైబల్ జాయింట్ డైరెక్టర్ శివానంద్ పరిశీలించారు. ఈ నిర్మాణానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని సెంట్రల్ ఆఫీసర్ ను స్టేట్ ఆఫీసర్లు కోరారు. అంతకుముందు సెక్రటేరియెట్ లో ట్రైబల్ సెక్రటరీ శరత్ తో జేడీ సమావేశమయ్యారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొంటూ స్టేట్ ఆఫీసర్లను జేడీ శివానంద్ అభినందించారు.

 ఈ మ్యూజియంలో రామ్ జీ గోండు, కుమ్రం భీమ్, అల్లూరి సీతరామరాజు, బిర్సా ముండా , నాగాలాండ్ ట్రైబల్ లీడర్ రాణి గైడనిల్లుల పోరాటాలు, జీవితాలు, వారు చేసిన ఉద్యమాలు, ఫోటోలు, జీవిత చరిత్ర ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. సమ్మక్క సారక్క జాతర, సంత్ సేవాల్ జయంతి, నాగోబా జాతర, ఖాందేవుని జాతర, పోతురాజు పండగల ప్రాధాన్యతతోపాటు పలు అంశాలను ప్రజలకు అందిస్తామని ట్రైబల్ అధికారులు పేర్కొన్నారు.