
- పట్టణాలు దాటి పల్లెలకు చేరుతున్న బ్యాటరీ వాహనాలు
- రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 50 వేల స్కూటర్లు సేల్
- 15–20 వేల దాకా త్రీవీలర్లు, కార్ల అమ్మకాలు
- ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై సబ్సిడీ ఇస్తున్న కేంద్రం
వరంగల్, వెలుగు: కరెంట్ బండ్లను జనం కాయిష్ చేస్తున్నరు. పెట్రోల్‌తో పోలిస్తే కరెంట్‌కు తక్కువ ఖర్చు కావడం, ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో పొల్యూషన్ లేకపోవడం, ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకునేందుకు ఈజీగా ఉండడంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నరు. పైగా వీటి అమ్మకాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటిదాకా హైదరాబాద్ లాంటి సిటీలకే పరిమితమైన ఎలక్ట్రిక్ వెహికల్స్.. ఇప్పుడు పల్లెలకు చేరుతున్నయ్. జిల్లా కేంద్రాల్లో కొత్తగా కరెంట్ బండ్ల షోరూమ్‌లు ఏర్పాటైతున్నయ్. గడిచిన ఆరు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల స్కూటర్లు, 15 వేల నుంచి 20 వేల వరకు త్రీవీలర్లు, కార్లు అమ్ముడయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 నుంచి 25 కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్‌లు ఓపెన్ చేశాయని అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడాది కిందటి వరకు ఒకట్రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ షోరూమ్‌లే ఉండగా.. ఇప్పుడా సంఖ్య 15 నుంచి 18కు చేరింది. ఒక్కో కంపెనీ గత ఆరు నెలల్లో 150 నుంచి 400 వాహనాలు విక్రయించింది. ఇట్లనే ఇతర ఉమ్మడి జిల్లాల్లోనూ కరెంట్ బండ్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి.
మైలేజీ ఎక్కువ.. ఖర్చు తక్కువ
పెట్రోల్ బండ్లతో పోలిస్తే కరెంట్ బండ్లకు ఖర్చు తక్కువ, మైలేజ్ ఎక్కువని జనం అంటున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ వెహికల్స్ తీసుకుంటే సిటీల్లో యావరేజ్‌గా లీటర్ పెట్రోల్‌కు 40 నుంచి 50 కిలోమీటర్లు మైలేజ్ వస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110 ఉంది. అదే కరెంట్ బండ్ల బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయడానికి 4 యూనిట్లు అవసరమవుతుంది. దీనికి రూ.30 నుంచి రూ.35 వరకు ఖర్చవుతుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 65 నుంచి 100 కిలోమీటర్ల వరకు తిరగవచ్చు. కంపెనీని బట్టి బండి మైలేజ్ 65 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ లెక్కన నగరాల్లో తిరగడానికి కరెంట్ బండ్లు బెటర్ అని జనం చెబుతున్నారు. రెగ్యులర్‌గా ఆఫీసులు, మార్కెట్లకు వెళ్లడానికి, పిల్లలను స్కూళ్లలో దింపడానికి ఎలక్ట్రిక్ బైక్స్ బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. ‘‘నెలకు సగటున రూ.3 వేల దాకా పెట్రోల్ ఖర్చు వస్తున్నది. ఎంతోకొంత డౌన్ పేమెంట్ కట్టి కరెంట్ బండి తీస్కుంటే.. ఏడాది రెండేండ్ల పాటు పెట్రోల్ ఖర్చులనే ఈఎంఐ కింద కట్టుకుంటే సరిపోతుంది. పైగా కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే 20 నుంచి 25 శాతం దాకా సబ్సిడీ ఇస్తున్నది” అని పేర్కొంటున్నారు.
స్మార్ట్ ఫీచర్స్‌తో ఫిదా..
జనం కరెంట్ బండ్లను ఇష్టపడడానికి వాటిల్లో ఉండే స్మార్ట్ ఫీచర్స్ కూడా ఒక కారణం. రూ.లక్షలు పెట్టి కొనే కారులో ఉండే సౌలతులను.. కొన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలోనూ అందుబాటులోకి తెచ్చాయి. గూగుల్ మ్యాప్ ద్వారా నావిగేషన్ పెట్టుకుని బైక్ స్క్రీన్‍పై దాన్ని చూడొచ్చు. బ్లూటూత్ ఆప్షన్ ఉండటంతో జర్నీలో ఫోన్ వస్తే, ఆ నంబర్ స్ర్కీన్‌పై కనిపిస్తుంది. ప్రత్యేక సౌండ్ సిస్టమ్ బాక్సులతో బ్లూటూత్ ద్వారా జర్నీలో మ్యూజిక్ కూడా వినొచ్చు. స్మార్ట్ స్కూటర్లలో ఎకో, రైడ్, స్పోర్ట్స్, ర్యాప్ వంటి ఆప్షన్లు ఉండడంతో అవసరాన్ని బట్టి గంటకు 50 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్న వెహికల్స్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉంది.
కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ సబ్సిడీ..
ఎలక్ర్టిక్ వెహికల్స్ అమ్మకాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. ప్రస్తుతం ఒక్కో బైక్‌పై రూ.22,450 సబ్సిడీ అందిస్తున్నది. ఈ లెక్కన రూ.లక్ష ఉండే వెహికల్ రూ.77,550కి లభిస్తుంది. కేంద్ర సబ్సిడీకి తోడు కొన్ని రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా సబ్సిడీ అందిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో కరెంట్ బండ్ల అమ్మకాలను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా సబ్సిడీ అందిస్తున్నాయి. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ కలిపి దాదాపు 40 శాతం దాకా వస్తున్నది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదు. గతంలో కేంద్రం పెట్రోల్‌పై ట్యాక్స్ తగ్గించినప్పటికీ, రాష్ట్ర సర్కార్ తగ్గించలేదు. ఇప్పుడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.110 ఉన్నది. ఈ నేపథ్యంలో కనీసం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించేందుకైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదు.
టూవీలర్ల సేల్స్ ఎక్కువ..
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ (ఫాస్టర్ అడప్షన్ అండ్ మ్యాన్ ఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ర్టిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్) స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ రెండో ఫేజ్‌ను 2019 ఏప్రిల్ 1న మొదలుపెట్టింది. మూడేండ్ల కాలానికి రూ.10 వేల కోట్ల బడ్జెట్ పెట్టింది. ఇప్పుడీ స్కీమ్‌ను 2024 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 7,27,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయి. ఇందులో అత్యధికంగా 4,34,914 టూవీలర్లు, 2,46,270 త్రీవీలర్స్ ఉన్నాయి.
రాష్ట్ర సర్కార్ సబ్సిడీ ఇయ్యాలె
ఈ రోజుల్లో బైక్ లేనిది బయట అడుగుపెట్టలేం. నెలకు ఏం తక్కువ రూ.3 వేలు పెట్రోల్‍కే ఖర్చు అవుతున్నది. పెట్రోల్ రేట్లేమో రోజురోజుకు పెరుగుతున్నయ్. అందుకే మంచి ఫీచర్స్ ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లు మాలాంటోళ్లకు ఎంతో బెటర్. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ చేస్తే సిటీలో చిన్న చిన్న పనులకు మూడ్రోజుల వరకు తిరగవచ్చు. రెగ్యులర్ బైకులతో పోలీస్తే ధరలు కొంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం లెక్కనే రాష్ట్ర సర్కార్ కూడా సబ్సిడీ ఇస్తే జనాలకు మేలు జరుగుతుంది. - కె.యాదగిరి, హనుమకొండ