
- విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్‌తో నడపలేరు
- ఎడ్యుకేషన్.. ఉమ్మడి జాబితాలోని అంశం
- సహకారం అంటే బలవంతం కాదు.. కేవలం సంప్రదింపులే
- వీసీల అర్హత ప్రమాణాలు మార్చడంపై ఫైర్
- కేరళలో నిర్వహించిన జాతీయ
- ఉన్నత విద్య సమ్మేళనానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని కేంద్రానికి సూచించారు. సహకారం అంటే బలవంతం కాదని.. కేవలం సంప్రదింపులేనని గుర్తు చేశారు. గురువారం కేరళలోని తిరువనంతపురంలో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ‘జాతీయ ఉన్నత విద్య సమ్మేళనం’లో తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు.
యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రభావం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా రంగంలో కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ‘మీరు బిల్లు చెల్లించాలి కానీ.. ఫుడ్ ఆర్డర్ చేయలేరు’ అన్న తరహాలో యూజీసీ కొత్త నిబంధనలు ఉన్నాయన్నారు. ‘‘రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పితే ఆ ప్రతిధ్వనులు ఎంత దూరమైనా చేరుతాయని చరిత్ర మనకు చెప్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలకు నిధులు సమకూర్చడంతో పాటు నిర్వహణ కోసమే అన్నట్టు కేంద్రం భావిస్తూ వీసీల నియామకాల నుంచి అడ్మిషన్ల వరకు కీలకమైన నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే.. రాష్ట్రాలు కేవలం భవనాలు ప్రారంభించే రిబ్బన్ కట్టింగ్ అధికారాలకు మాత్రమే పరిమితం అవుతా యి.
విద్య కేంద్రం గుత్తాధిపత్యం కాదు. ఇది ఉమ్మడి జాబితాలోని అంశమని కేంద్రం గుర్తించాలి. ఆయా రాష్ట్రాలు వారి ప్రజలకు, వ్యవస్థలకు సరిపోయే విద్యా సంస్థలను, వ్యవస్థలను నిర్మించుకుంటారు. రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పోలిక ఉండదు. స్వయం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రమూ అందించలేదు’’ అని భట్టి అన్నారు.
సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర తొలగించొద్దు
యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల నియామకం, సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం ఆందోళనకరమైన అంశమని డిప్యూటీ సీఎం భట్టి అన్నా రు. వీసీల అర్హత ప్రమాణాలను మార్చడం సరికాదన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రెన్స్ టెస్ట్ తప్పనిసరి చేయడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సహకార సమాఖ్య వ్యవస్థ, యూజీసీ తాజా నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు, కర్నాటక మంత్రి ఎంసీ.సుధాకర్ అవారే, తమిళనాడు నుంచి తిరుగోవి చేజియాన్, పంజాబ్ నుంచి సర్దార్ హర్జోత్ సింగ్‌తో పాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు.