![జగిత్యాలలో ‘నక్ష’](https://static.v6velugu.com/uploads/2025/02/central-government-launched-naksha-program-to-provide-land-titles-to-everyone-in-jagtial-with-a-specific-valuation_OacWCRnjvh.jpg)
- ప్రతి ఒక్కరి భూమికి నిర్ధిష్టమైన అంచనాతో పట్టాలు ఇచ్చేలా కేంద్రం చర్యలు
- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన జగిత్యాల మున్సిపాలిటీ
- అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే
జగిత్యాల, వెలుగు : ప్రతి ఒక్కరి భూమికి నిర్దిష్టమైన అంచనాతో పట్టాలు ఇచ్చేందుకు కేంద్ర సర్కార్ ‘నక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్ట్‌లుగా రాష్ట్ర వ్యాప్తంగా పది మున్సిపాలిటీలను ఎంపిక చేయగా ఇందులో జగిత్యాల సైతం సెలెక్ట్ అయింది. దీంతో ఆర్‌వో అసోసియేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్, బల్దియా ఆఫీసర్లు కలిసి శనివారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు.
ఆరు గంటల పాటు హెలికాప్టర్ సర్వే
నక్ష కార్యక్రమంలో భాగంగా లైడర్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ కలిగిన హెలికాప్టర్ ద్వారా శనివారం ఏరియల్ సర్వే చేపట్టారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వే నిర్వహించారు.
సర్వేలో అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డితో పాటు ఏడీ వెంకట్‌రెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌గౌడ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రైవేట్, సర్కారీ భూములతో పాటు చెరువులు, సహజ వనరులు, బిల్డింగ్స్‌ను గుర్తించారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ద్వారా నాలుగు సెంటీమీటర్ల నిర్దిష్టతతో బార్డర్లను ఏర్పాటు చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
గ్రౌండ్ లెవల్‌లో మరో సారి సర్వే
ఏరియల్ సర్వే పూర్తయ్యాక ఆ వివరాలను సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్‌కు పంపించనున్నారు. ఇందులోని లోపాలను సరి చేసి కచ్చితమైన మ్యాప్‌ను సంబంధిత ఆఫీసర్లకు పంపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్, బల్దియా ఆఫీసర్లు జాయింట్‌గా మరోసారి గ్రౌండ్ లెవల్‌లో సర్వే చేపట్టనున్నారు.
దీని సర్వే ఆధారంగా ప్రతి ఆస్తికి పట్టాలు ఇచ్చేలా ఆఫీసర్లు రూపకల్పన చేస్తున్నారు. అలాగే సర్వే ఆధారంగా భవిష్యత్‌లో చేయాల్సిన అభివృద్ది పనులను కూడా అంచనాలు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.