దర్యాప్తులో ప్రైవేట్ చాట్స్ సేకరించొద్దు ..దర్యాప్తు సంస్థలకు గైడ్ లైన్స్ రూపొందిస్తున్న కేంద్రం

దర్యాప్తులో ప్రైవేట్ చాట్స్ సేకరించొద్దు ..దర్యాప్తు సంస్థలకు గైడ్ లైన్స్ రూపొందిస్తున్న కేంద్రం
  • కేసుకు సంబంధం లేని వ్యక్తిగత వివరాలు తీసుకోవద్దు

న్యూఢిల్లీ: వివిధ కేసుల దర్యాప్తులో నిందితులు లేదా అనుమానితులకు చెందిన ప్రైవేట్ చాట్ లు, డిజిటల్, పేపర్ డాక్యుమెంట్లతో కూడిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే విషయంలో దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక గైడ్ లైన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా వ్యక్తిగత, కేసుకు సంబంధం లేని డేటాకు రక్షణ కల్పించేలా కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. రెండు వేర్వేరు కేసుల్లో వ్యక్తిగత డేటాను సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్, అమెజాన్ ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వీటిపై సోమవారం (జనవరి 6) విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధం లేని ప్రైవేట్ డేటాను సేకరించకుండా ఉంటే న్యాయపరంగా సమస్యలు ఉండవని కేంద్రం భావిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ గత నవంబర్​లో చెన్నై, కోల్ కతాలోని శాంటియాగో మార్టిన్ కు చెందిన ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో రూ. 12 కోట్ల నగదుతోపాటు అతడి ఐఫోన్ ను సీజ్ చేసింది. అయితే, తన ఐఫోన్ లో పర్సనల్ చాట్స్, ఇతర డేటా ఉన్నాయని, వాటికి కేసుతో సంబంధం లేదని.. అందుకే ఆ ఫోన్ నుంచి డిజిటల్ రికార్డులను ఈడీ సేకరించకుండా చూడాలంటూ మార్టిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

దీంతో ఆ పిటిషన్ ను ఇదివరకే ఫెమా రూల్స్ ఉల్లంఘన కేసులో ఫైల్ అయిన అమెజాన్ పిటిషన్ తో కలిపి జనవరి 6న విచారించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయితే, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే తమ ప్రైవసీ హక్కుకు భంగం కలుగుతుందంటూ నిందితులు వాదిస్తే.. కోర్టుల్లో వారికి అనుకూలంగానే ఉత్తర్వులు వస్తున్న నేపథ్యంలో ప్రైవసీకి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేయనుంది. ఇందుకోసం గైడ్ లైన్స్ రూపొందిస్తున్నట్టు విన్నవించనుంది. కేంద్రం రూపొందించే గైడ్ లైన్స్ ను సుప్రీంకోర్టు ఆమోదిస్తే గనక.. దర్యాప్తు సంస్థలకు అడ్డంకులు తొలగనున్నాయని భావిస్తున్నారు.