న్యూఢిల్లీ: యెమన్‌లో భారతీయ నర్సు ప్రియకు మరణశిక్షపై భారత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. యెమన్ పౌరుడి హత్య కేసులో కేరళ నర్సు ప్రియ మరణ శిక్షపై తమకు సమాచారం ఉందని ఎంఏఈ పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘యెమన్‌లో నర్సు ప్రియ మరణ శిక్షపై మాకు సమాచారం ఉంది. ప్రియను రక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. ప్రియ ఫ్యామిలీ కూడా ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రియ ఫ్యామిలీకి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
అసలు ప్రియా కేసు ఏంటీ..?
కేరళలోని పాలక్కడ్‌కు చెందిన నిమిషా ప్రియా 2008లో యెమన్ వెళ్లి అక్కడ నర్సుగా పని చేసింది. అనంతరం 2015లో తన స్వంత క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచించింది. అయితే.. యెమన్ చట్ట ప్రకారం అక్కడ సొంతగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యెమన్ జాతీయుడిని పెళ్లి చేసుకోవాలి. ఇందుకోసం యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీని ప్రియా 2015లో పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2017లో మహదీని ప్రియా హత్య చేసింది.
ఈ కేసులో ప్రియా దోషిగా తెలడంతో యెమన్ న్యాయస్థానం ఆమెకు మరణ శిక్ష విధించింది. శిక్ష రద్దు కోసం ప్రియా ఫ్యామిలీ పోరాటం చేయగా.. అవేవి ఫలించలేదు. ప్రియా మరణశిక్షను యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి సోమవారం (డిసెంబర్ 30) ఆమోదించారు. మహదీ ఫ్యామిలీ ప్రియాకు క్షమాబిక్ష ప్రసాదించకపోతే వచ్చే నెల రోజుల్లో ప్రియాకు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రియా మరణ శిక్షపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది.