తెలంగాణలో కేవీలు 533, జేఎన్‌‌వీల్లో 33 స్మార్ట్ కాస్ల్ రూంలు : జయంత్ చౌదరి

తెలంగాణలో కేవీలు 533, జేఎన్‌‌వీల్లో 33 స్మార్ట్ కాస్ల్ రూంలు : జయంత్ చౌదరి
  • పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ  ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో 533, జవహార్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌‌వీ) 33 స్మార్ట్ క్లాస్ (ఈ– క్లాస్ రూంలు) అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం లోక్‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

కేంద్రీయ విద్యాలయాల్లో మేడ్చల్– మల్కాజ్‌‌గిరి జిల్లాల్లో అత్యధికంగా 244, రాజన్న సిరిసిల్లలో కేవలం ఒక స్మార్ట్ క్లాస్ రూం ఉన్నట్లు తెలిపారు. అలాగే, జవహార్ నవోదయ విద్యాలయాల్లో కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 5, సిద్దిపేటలో రెండు మాత్రమే స్మార్ట్ క్లాస్ రూంలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కాగా, పెద్దపల్లిలోని కేంద్రీయ విద్యాలయాల్లో 19 స్మార్ట్ క్లాస్‌‌ రూమ్‌‌లు ఉన్నట్లు రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

స్కిల్ ఇండియా స్కీం కింద.. ఐదేండ్లలో తెలంగాణకు రూ.146.75 కోట్లిచ్చాం.. 

గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2019–20 నుంచి 2023–24) స్కిల్ ఇండియా స్కీం కింద తెలంగాణకు రూ.146.75 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), జన్ శిక్షక్ సంస్థాన్(జేఎస్ఎస్), నేషనల్ అప్రెంటీస్‌‌ షిప్ ప్రొమోషన్ స్కీం(ఎన్‌‌ఏపీఎస్), క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీం(సీటీఎస్)లో భాగంగా ఈ నిధుల్ని విడుదల చేశామని పేర్కొంది.

ఈ మేరకు సోమవారం లోక్‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో పీఎంకేవీవై కింద రూ.103.01 కోట్లు, జేఎస్ఎస్ కింద రూ.18.4 కోట్లు, ఎన్ఏపీఎస్ కింద రూ.25.34 కోట్లు రిలీజ్ చేశామని తెలిపారు. ఈ స్కీం ల కింద 4,86,527 మందికి వివిధ పనుల్లో నైపుణ్యం కల్పించామని వెల్లడించారు. పీఎంకేవీవై కింద1,78,681 మంది, జేఎస్ఎస్‌‌ కింద 57,286 మంది, ఎన్ఏపీఎస్ కింద 1,31,699 మంది, సీటీఎస్ కింద 1,18,861 మంది ట్రైనింగ్ తీసుకున్నట్లు చెప్పారు. కాగా, తెలంగాణలోని కేవలం పెద్దపల్లి జిల్లా నుంచి 9,690 మంది శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు.