జగిత్యాల, రామప్ప రోడ్డు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జగిత్యాల, రామప్ప రోడ్డు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: జగిత్యాల నుంచి రామప్ప వరకు ఉన్న రోడ్డు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, అందువల్ల ఆ రోడ్డు అభివృద్ధి రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ బాధ్యతని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గురువారం లోక్‌‌‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే.. జగిత్యాల– -ధర్మారం–- పెద్దపల్లి– -కల్వశ్రీరాంపూర్– -కిష్టంపేట– -టేకుమట్ల– -రామప్ప వరకు ఉన్న ప్రతిపాదిత నేషనల్ హైవే ప్రస్తుత స్థితి ఏంటని ఎంపీ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజా బడ్జెట్ కేటాయింపులు, వివిధ శాఖల అనుమతుల వివరాలు చెప్పాలని కోరారు. 

ఒకవేళ కేటాయింపులు, అనుమతులు ఇవ్వకపోతే అందుకు గల కారణాలు వివరించాలన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి బదులిస్తూ.. ఆ ప్రాజెక్టు స్టేట్ రోడ్ పరిధిలో ఉన్నందున బడ్జెట్ కేటాయింపులు చేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర రహదారులను నేషనల్ హేవేలుగా ప్రకటించడం/అప్‌‌‌‌గ్రేడ్ చేయడం కోసం తెలంగాణతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తూనే ఉన్నామన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్‌‌‌‌తో కనెక్టివిటీ, పరస్పర ప్రాధాన్యత, ట్రాఫిక్ ఆధారంగా కొన్ని రాష్ట్ర రోడ్లను నేషనల్ హైవేలుగా ప్రకటించడాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తున్నదని గడ్కరీ తెలిపారు.

భారత్ మాల పరియోజన కింద ఆరు ప్రాజెక్టులు..

తెలంగాణలో భారత్ మాల పరియోజన కింద ఆరు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులను అప్రూవ్ చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో పలు ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని, మరికొన్ని అమలు చేసే దశలో ఉన్నాయని తెలిపారు. రెండు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ పరిశీలనలో ఉందని వెల్లడించారు.