- ఇన్‌కం టాక్స్ చట్టానికి సవరణ తెస్తున్న ప్రభుత్వం
- కెయిర్న్, ఓడాఫోన్‌లకు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: పాత డీల్స్‌పై పన్ను విధింపును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇన్‌కం టాక్స్ యాక్ట్‌కు సవరణతో గతంలో విధించిన ఈ రెట్రాస్పెక్టివ్ టాక్స్‌ను తొలగించింది. ఇన్‌కం టాక్స్ యాక్ట్ సవరణ బిల్లును ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియాలోని ఎసెట్స్‌ను విదేశాలకు బదిలీ చేసేప్పుడు ఈ రెట్రాస్పెక్టివ్ టాక్స్‌ను విధించేవారు. మే 28, 2012 కి ముందు జరిగిన అలాంటి లావాదేవీలపై ఇక మీదట పన్ను విధించరాదని తాజా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ఇప్పటికే పన్ను చెల్లించాలంటూ జారీ చేసిన నోటీసులను కూడా వెనక్కి తీసుకోవాలని ఇందులో పొందుపరిచారు. అంటే కెయిర్న్, వోడాఫోన్‌లకు ఈ సవరణ చాలా పెద్ద ఊరట కలిగిస్తుంది. ఇందుకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కోర్టులలోని పెండింగ్ కేసులను వెనక్కి తీసుకోవడం, పరిహారం కోరకపోవడం, వడ్డీ అడక్కపోవడం వంటి అంశాలపై ఆయా కంపెనీలు అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్లుగా తెచ్చిన రిఫార్మ్స్ వల్ల దేశంలోని ఫైనాన్షియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌కు మేలు జరిగింది. ఆ రిఫార్మ్స్ వల్లే దేశంలో పెట్టుబడులు పెరిగాయి. కానీ, ఈ రెట్రాస్పెక్టివ్ టాక్స్ విధింపు వల్ల విదేశీ పెట్టుబడిదారులలో కొంత అసంతృప్తి పెరిగింది. కొన్ని వివాదాలు అంతర్జాతీయ కోర్టులకు, ఆర్బిట్రేషన్‌కు చేరడంతో దేశ ప్రతిష్టపై కొంత దెబ్బతింది. ఫలితంగా విదేశీ ఇన్వెస్టర్లు కొంత మంది పెట్టుబడులు పెట్టే విషయంలో వెనకడుగు వేశారు కూడా. కొవిడ్–19 మహమ్మారి కారణంగా మన దేశ ఎకానమీని వెంటనే రికవరీ చేసుకోవల్సిన అవసరం కలిగింది. వేగంగా రికవరీ సాధించడానికి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు మన దేశానికి కావాలి. ఈ కారణాల వల్లే రెట్రాస్పెక్టివ్ టాక్స్‌ను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కెయిర్న్, వోడాఫోన్ గ్రూప్లక ఊరట..
రెట్రాస్పెక్టివ్ టాక్స్ విధింపుతో ఇబ్బందులలో పడిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ, వోడాఫోన్ గ్రూప్‌లకు ముఖ్యంగా తాజా సవరణ ఉపశమనం కలిగిస్తుంది. వడ్డీ లేకుండా ఆయా కంపెనీలు చెల్లించిన టాక్స్ మొత్తాన్ని రిఫండ్ చేయనున్నట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు కంపెనీలూ కూడా రెట్రాస్పెక్టివ్ టాక్స్ విధింపు చెల్లదని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్ ట్రిబ్యునల్స్‌లో ఆదేశాలు తెచ్చుకున్నాయి. వేల కోట్ల రూపాయలను రెట్రాస్పెక్టివ్ పన్నుగా ఈ కంపెనీలపై మన ప్రభుత్వం విధించింది. దీంతో ఆ విదేశీ కంపెనీలు రెండూ, దేశంలో కూడా చాలా కాలం న్యాయపోరాటం చేశాయి. రెట్రాస్పెక్టివ్ టాక్స్ కింద ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల (రూ. 9 వేల కోట్ల) ను కెయిర్న్ ఎనర్జీ మన ప్రభుత్వానికి చెల్లించింది. దీనిని వెనక్కి రాబట్టుకునేందుకు విదేశాలలోని మన దేశపు ఎసెట్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఆర్బిట్రేషన్స్ ట్రిబ్యునల్ నుంచి ఆర్డర్లను తెచ్చుకొంది. ఇక వోడాఫోన్‌పై కూడా రూ. 21 వేల కోట్లకు పైగా మొత్తాన్ని రెట్రాస్పెక్టివ్ టాక్స్ కింద విధించారు. దీంతో ఈ గ్రూప్ సైతం దేశ, విదేశాలలో న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. మొత్తం 17 కంపెనీలపై ఈ రెట్రాస్పెక్టివ్ టాక్స్‌ను విధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.1961 ఇన్‌కం టాక్స్ యాక్ట్ ప్రకారం మన దేశంలోని కంపెనీలో వాటా కొన్నందుకు తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనే వోడాఫోన్ వాదనతో 2012లోనే సుప్రీం కోర్టు ఏకీభవించింది. కానీ, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చట్టానికి సవరణ ప్రతిపాదించడంతో, ఇన్‌కం టాక్స్ అధికారులకు రెట్రాస్పెక్టివ్ టాక్స్ విధించే అధికారం దక్కింది.
వివాదాలకు తెరతీసిన రెట్రాస్పెక్టివ్ టాక్స్‌ను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కెయిర్న్, వోడాఫోన్ వంటి కంపెనీలపై ఈ పన్ను విధించడంతో, ఆ కంపెనీలు దీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నాయి. దాంతో కొంత మంది విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు
పెట్టడానికి సైతం వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంతోపాటు, ఎకానమీ వేగంగా రికవరీ కావడానికి విదేశీ పెట్టుడులు మరిన్ని అవసరం ఉండటంతో ప్రభుత్వం ఈ రెట్రాస్పెక్టివ్ టాక్స్ విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది.
రెట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే..
కొన్ని కంపెనీలపై వెనకటి లావాదేవీలకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కెయిర్న్, వోడాఫోన్లపై రెట్రాస్పెక్టివ్ టాక్స్ విధించారు. ఈ రెట్రాస్పెక్టివ్ టాక్స్‌ను 2012 లో అమలులోకి తెచ్చారు. ఈ చట్టం కింద ఇండియాలో ఆస్తులున్న ఏదైనా విదేశీ కంపెనీ తన వాటాలను బదిలీ చేసుకుంటే వచ్చే మొత్తం మీద క్యాపిటల్ గెయిన్స్ పన్నును కట్టాలనేది ఈ రూల్.