- మెదక్ ఎంపీ రఘునందన్ రావు
మెదక్, వెలుగు: గిరిజనుల సంక్షేమానికి కేంద్రంలోని మోడీ సర్కారు పెద్దపీట వేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్బంగా శుక్రవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. 70 శాతం కేంద్రం నిధులతో, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దేశంలోని 26 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 700 పైగా గిరిజన తెగల అభివృద్ధికి రూ.79,156 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో 15 గ్రామ పంచాయతీలు ఈ పథకం కింద ఎంపికైనట్లు చెప్పారు.
స్వాతంత్య్రం కోసం, గిరిజన బిడ్డల అభ్యున్నతి, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గొప్ప మహానీయుడు బిర్సా ముండా అని కొనియాడారు. గిరిజన తెగల భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులందరికీ బిర్సా ముండా చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన తెగల సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ ఆఫీసర్ ఇందిర, జిల్లా అధికారి నీలిమ పాల్గొన్నారు.