పంట వ్యర్థాలు కాలిస్తే జేబు ఖాళీ: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కేంద్రం సంచలన నిర్ణయం

పంట వ్యర్థాలు కాలిస్తే జేబు ఖాళీ: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కేంద్రం సంచలన నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాతో పాటు వాహనాల నుండి వెలువడే విషపూరిత వాయువుల వల్ల ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవుతోంది. దీనికి తోడు ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో రైతులు దగ్ధం చేసే పంట వ్యర్థాలు ఢిల్లీని మరింత కాలుష్య కోరల్లోకి నెడుతున్నాయి. రాజధానిలో కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనుకున్న స్థాయిలో కాలుష్యాన్ని నియంత్రించలేకపోతున్నాయి. ఢిల్లీని తీవ్రంగా వేధిస్తోన్న కాలుష్యం సమస్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు సైతం ఇటీవల సీరియస్ అయ్యింది. పంట వ్యర్ధాలను తగలబెట్టి కాలుష్యానికి కారణమవుతోన్న పంజాబ్, హర్యానా రైతులపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌, హర్యానాలో పంట వ్యర్థాలను దగ్ధం చేసే రైతులకు భారీగా జరిమానాలు విధించాలని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024, నవంబర్ 7వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.  ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం ఇప్పటికే ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సరి బేసి విధానం.. బాణాసంచా పేల్చడంపై నిషేదం వంటివి అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 

ALSO READ : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. బీజేపీ, ఎన్సీ సభ్యుల మధ్య తోపులాట

ఎన్నికల్లో విజయం సాధించి నెల తిరగకముందే.. హర్యానాలో రైతులకు భారీ జరిమానాలు విధించాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్, హర్యానా రాష్ట్ర రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. రైతుల ఆందోళనలకు తలొగ్గిన మోడీ సర్కార్.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో రైతులకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.

రైతులకు జరిమానా వివరాలు:

  • 2 ఎకరాలు ఉన్న రైతు పంట వ్యర్థాలను కాలిస్తే రూ.5 వేల జరిమానా.. 
  • 2 నుంచి 5 ఎకరాల ఉన్న రైతు పంట వ్యర్థాలను తగలబెడితే రూ.10 వేల ఫైన్
  • 5 ఎకరాలకు పైబడి పంట వ్యర్థాలను కాలిస్తే రూ. 30 వేలు జరిమానా