కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు సరికాదు : జూలకంటి రంగారెడ్డి

సూర్యాపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును సొంత పార్టీ ఆఫీస్​లాగా వాడుకుంటూ బిల్లులు, చట్టాల పై చర్చ లేకుండా ఏకపక్షంగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు  సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. 

బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగా లేదన్నారు. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటన ఎమర్జెన్సీ తలపించేలా ఉందని మండి పడ్డారు.

 పార్లమెంట్ లోకి ఆగంతకులు ప్రవేశించి పొగ గొట్టాలు వేయడం అంటే దేశ రక్షణ ఎలా ఉందో అర్థం అవుతుంది అన్నారు. పార్లమెంటుకే రక్షణ కరువైన పరిస్థితుల్లో దేశ ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారో బీజేపీ నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి బీజేపీ ప్రభుత్వం కాలం గడుపుతుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష పార్టీలను బరిష్కరించడానికి వ్యతిరేకిస్తు ఈనెల 22న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అధ్యక్షతన జరిగినఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టియాదగిరి రావు, మట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, నాగారపు పాండు, కోట గోపి, చెరుకు ఏ క లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.