హైదరాబాద్​– విజయవాడ హైవే ఆధునికీకరణకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్

  • హైదరాబాద్​– విజయవాడ హైవే ఆధునికీకరణకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్
  • ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​ల కోసం రూ.420కోట్లు మంజూరు

నల్గొండ, వెలుగు:  హైదరాబాద్– ​-విజయవాడ నేషనల్​హైవే(ఎన్​హెచ్​–65) పై రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాలుగు లైన్ల రోడ్డును ఆరు లైన్లుగా విస్తరించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. ప్రమాదాలు జరగకుండా హైవేపై  17 చోట్ల బ్లాక్​స్పాట్లు గుర్తించింది. అక్కడ ఫ్లై ఓవర్​ బ్రిడ్జిలు, అండర్​పాస్​ బ్రిడ్జిలు,  సర్వీసు రోడ్లు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది.  

ఎన్‌‌‌‌హెచ్–65పై నిత్యం ప్రమాదాలే...

హైదరాబాద్– విజయవాడ వరకున్న ఎన్‌‌‌‌హెచ్–65  రాష్ట్ర పరిధిలో 182 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రోడ్డుపై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  ప్రస్తుతమున్న రోడ్డు నిర్మించేటప్పుడు జంక్షన్లు, సర్వీసు రోడ్లు నిర్మించకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర పరిధిలో 17 బ్లాక్​స్పాట్లను నేషనల్​హైవే అథారిటీ గుర్తించింది.  వీటి వద్ద సర్వీసు రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​లు నిర్మించేందుకు కేంద్ర ట్రాన్స్​పోర్ట్ ​మినిస్టర్​నితిన్​గడ్కరీ ఆమోదం తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని హైవే అథారిటీ అధికారులు తెలిపారు.

అండర్​పాస్‌‌‌‌లు, ఫ్లైఓవర్లు  నిర్మాణానికి ఫండ్స్​

చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి కోదాడ వరకు  గుర్తించిన 17 బ్లాక్​ స్పాట్ల వద్ద అండర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.420 కోట్లు మంజూరు చేసింది. వీటిలో చౌటుప్పుల్​ వద్ద చేపట్టే నిర్మాణ పనులకు రూ.114.40కోట్లు, పెద్దకాపర్తి వద్ద రూ.29.90 కోట్లు, చిట్యాల రూ.42.18 కోట్లు, నల్గొండ క్రాస్​ రోడ్డు టు కట్టంగూరు జంక్షన్​ రూ.0.26 కోట్లు, కొర్లపహాడ్​ టోల్​గేట్​ వద్ద రూ.5.96 కోట్లు, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీ, జనగామ క్రాస్​ రోడ్డు వద్ద జంక్షన్​కు రూ.58.44 కోట్లు, సూర్యాపేట జంక్షన్​ వద్ద రూ.27.97కోట్లు, దురాజ్‌‌‌‌పల్లి క్రాస్​ రోడ్డు రూ. 2.80కోట్లు, ముకుందాపురం(కోదాడ) వద్ద రూ.13.86 కోట్లు, ఆకుపాముల టర్నింగ్​ పాయింట్ వద్ద రూ.2.16 కోట్లు, కోమరబండ క్రాస్​ రోడ్డు వద్ద రూ.31 .01 కోట్లు, కట్టమ్మగూడెం జంక్షన్​ రూ.10.89కోట్లు, మేళ్లచెర్వు జంక్షన్​ వద్ద రూ. 0.46 కోట్లు, శ్రీరంగాపురం రూ.8.50కోట్లు, రామాపురం క్రాస్​ రోడ్డు వద్ద  రూ.30.26కోట్లు, నవాబ్​పేట రూ.0.21 కోట్లు, టేకుమట్ల వద్ద జరిగే పను లకు రూ.41.02 కోట్లతో పనులు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన రిలీజ్​చేసింది. 

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం


నేషనల్​ హైవే 65ను ఆరు లైన్లుగా విస్తరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరాం.  అయితే హైవే విస్తరణకు బదులు హైవేపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు 17 చోట్ల బ్లాక్​ స్పాట్స్‌‌‌‌ గుర్తించి అండర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌లు, ఫ్లైఓవర్​బ్రిడ్జిలు నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.420 కోట్లు రిలీజ్​ చేసినందుకు ధన్యవాదాలు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సహచర ఎంపీ ఉత్తమ్​కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నేను కట్టుబడి ఉన్నాం. 

- ‌‌‌‌‌‌‌‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ