ఒక దేశం, ఒకే ఎన్నికలు.. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు

ఒక దేశం, ఒకే ఎన్నికలు.. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు

"వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌".. జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. దీన్ని తీసుకువచ్చినప్పుడు, విస్తృత సంప్రదింపుల కోసం బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఏంటి ఈ బిల్లు..? 

దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు.. అనగా లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం. అందుకోసమే కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫారసులు చేసింది. అనంతరం బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక మిగిలింది బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే. బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర పడితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

ALSO READ | మోదీ, అదానీ మాస్క్లతో కాంగ్రెస్ ఎంపీలు..  రాహుల్  పరిహాసం

కేబినెట్ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, కోవింద్ కమిటీ సిఫార్సు చేసిన విధంగా ONOP రెండు దశల్లో అమలు చేయబడుతుందని ప్రభుత్వం తెలిపింది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండవ దశలో సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజులలోపు స్థానిక సంస్థల ఎన్నికలు (పంచాయతీ, మునిసిపాలిటీలు) ఉంటాయి. అలాగే, ఉమ్మడి ఓటర్ల జాబితా, అమలకు ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి.

జమిలి ఎన్నికలు ఏయే దేశాల్లో జరుగుతున్నాయి?

సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు జరిగే ప్రపంచ దేశాలు చాలా తక్కువ. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా దేశాలు జమిలి ఎన్నికలు నిర్వహిస్తాయి. కానీ జనాభా పరంగా ఇవి మన దేశంతో పోలిస్తే చాలా చిన్న దేశాలు. మన పొరుగు దేశం నేపాల్‌కు జమిలి ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉంది.  2015లో నేపాల్‌లో కొత్త రాజ్యాంగం ఆమోదం పొందినపుడు.. 2017 ఆగస్టులో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించారు.