
- కేసీఆర్ దెబ్బకే కేంద్రం వెనక్కి
- విశాఖ స్టీల్‌పై కేంద్ర మంత్రి ప్రకటన
- బీఆర్ఎస్, ఏపీ ప్రజల విజయం
- ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకున్నా మేం పోరాడినం: మంత్రి హరీశ్
హైదరాబాద్, వెలుగు : ‘‘కేసీఆర్ దెబ్బకే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గింది” అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇది కేసీఆర్, బీఆర్ఎస్, ఏపీ ప్రజలు, అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల విజయమని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకున్నా బీఆర్ఎస్ పోరాటం చేసిందని చెప్పారు.
గురువారం వికారాబాద్ జిల్లా మర్పల్లి లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం అడ్డికి పావు సేరు లెక్క అమ్ముతున్నదని, 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నదని నేను, కేసీఆర్, కేటీఆర్ మాట్లాడినం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటానికి బీఆర్ఎస్ గట్టిగా నిలుస్తుందని కేసీఆర్ ప్రకటించడంతోనే కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రే ప్రకటించారు. ప్లాంట్ ను బలోపేతం చేస్తామని కూడా చెప్పారు” అని పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని, అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ జెండా పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు.
విజయోత్సవ సభలా ఉంది
మర్పల్లిలో నిర్వహిస్తున్నది ఆత్మీయ సమ్మేళనం లాగా లేదని, విజయోత్సవ సభ లాగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘‘వికారాబాద్ కు పక్కనే చించోలి ఉంది. అక్కడ నీళ్లు వస్తున్నాయా’’ అని ప్రజలను ప్రశ్నించారు. ‘‘సీఎం కేసీఆర్ పట్టు బట్టి తెలంగాణ తెచ్చారు.. ఇంటింటికి నీళ్లు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేని పనులను కేసీఆర్ చేసి చూపించారు. ప్రతి ఇంట్లోనూ కేసీఆర్ఉన్నారు. సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు. తొమ్మిదేండ్లలో ఏనాడైనా ఎరువులు, కరెంట్, నీళ్లకు ఇబ్బంది వచ్చిందా.. మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటార్లు కాలిపోతాయి..ఎరువుల బస్తాకు తిప్పలు వస్తుంది. పథకాలు నిరంతరంగా అమలు కావాలంటే మళ్లీ కేసీఆర్ పాలనే రావాలి” అని హరీశ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని కాంగ్రెస్ చెప్పి మోసం చేసిందని, తాము పదవులను గడ్డిపోచల్లా వదిలేశామని తెలిపారు. ‘‘వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో చదువుకునేందుకు ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ డిగ్రీ కాలేజీ ఇచ్చారు. వికారాబాద్ కు మెడికల్ కాలేజీ వచ్చింది. దేశం మొత్తం కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇచ్చేందుకు మోడీకి మనసు రాలేదు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి” అని అన్నారు. త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.