- దేశంలోని 28 రాష్ట్రాలు/యూటీలకు నిధులు విడుదల
న్యూఢిల్లీ, వెలుగు : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాల పంపిణీ కింద తెలంగాణకు రూ.3,637 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఏపీకి రూ.7,002.52 కోట్లు విడుదల చేసింది. జనవరి నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా పంపిణీ నిధులను కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు/యూటీలకు రూ.1,73,030 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. మూలధన వ్యయాన్ని వేగవంతం చేసే ఉద్దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సంబంధిత ఖర్చులను దృష్టిలో పెట్టుకొని అధిక మొత్తంలో నిధులు రిలీజ్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పన్నుల వాటాలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా రూ.31,039 కోట్లు వచ్చాయి.
తర్వాతి స్థానంలో బిహార్ రూ.17,403 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,582 కోట్లు, వెస్ట్ బెంగాల్‌కు రూ.13,017 కోట్లను కేంద్రం పంపిణీ చేసింది. అత్యల్పంగా గోవాకు రూ.667 కోట్ల వాటాను రిలీజ్ చేసింది. అయితే, గత డిసెంబర్ పన్నుల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం కేవలం రూ.89,086 కోట్లు రిలీజ్ చేసింది. నిబంధనల ప్రకారం.. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయొచ్చని కేంద్రం వెల్లడించింది.