
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జనవరి నెల వరకు రూ.1.95 లక్షల కోట్ల పన్ను ఎగవేతలు గుర్తించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం ( మార్చి 10 ) లోక్ సభలో వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జనవరి వరకు.. 25,397 పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయని తెలిపారు మంత్రి. గత ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ అధికారులు గుర్తించిన మొత్తం జీఎస్టీ ఎగవేత కేసుల సంఖ్య 86,711గా ఉందని.. వీటి మొత్తం విలువ రూ.6.79 లక్షల కోట్లకు పైగా ఉందని తెలిపారు మంత్రి.
ఈ ఆర్థిక సంవత్సరంలో (జనవరి 2025 వరకు), నమోదైన ఎగవేత కేసుల సంఖ్య 25,397 కాగా.. మొత్తం విలువ రూ.1,94,938 కోట్లుగా ఉందని తెలిపారు మంత్రి. అదే సమయంలో, పన్ను ఎగవేత కేసులలో రూ.21,520 కోట్ల వాలంటరీ డిపాజిట్ అయ్యిందని తెలిపారు.
2024 - 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఐటీసీ మోసాల కేసులు 13,018 కాగా.. వీటి మొత్తం విలువ రూ.46,472 కోట్లుగా ఉందని తెలుస్తోంది. వీటిలో రూ.2,211 కోట్ల వాలంటరీ డిపాజిట్ జరిగిందని తెలిపారు మంత్రి పంకజ్ చౌదరి. జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో, 20,582 ఎగవేత కేసులు నమోదు కాగా.. వీటి మొత్తం విలువ రూ.2.30 లక్షల కోట్లు అని తెలుస్తోంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఎగవేత విలువ రూ. 1.32 లక్షల కోట్లు కాగా.. 2021-22లో రూ. 73,238 కోట్లు, 2020-21లో రూ. 49,384 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జీఎస్టీ పన్ను ఎగవేతలు నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి పంకజ్ చౌదరి.