
ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్పా ఇంకేమీ కనిపించలేట్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించారు. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలన విజయాలపై విశాఖ పట్టణంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీ నాయకులు తమవిగా చెప్పుకుంటున్నారన్నారు. తమది రైతు ప్రభుత్వం అని అంటున్న సీఎం జగన్ రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో నిలవడంపై ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను రైతు భరోసా పేరుతో జగన్పంచుతున్నారన్నారు. బియ్యం సప్లైపై కూడా జగన్ ఫొటోలు ముద్రిస్తున్నారన్నారు.
అరాచకాలకు అడ్డాగా వైజాగ్
వైజాగ్‌ను భూమాఫియా, మైనింగ్‌మాఫియా తదితర అరాచకాల శక్తులకు అడ్డాగా వైసీపీ మార్చిందని విమర్శించారు. సికింద్రాబాద్– విశాఖపట్నం – తిరుపతిలకు కేంద్రం 2 వందే భారత్ రైళ్లు తెచ్చిందని తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ర్టంలో ఎన్నో కొత్త రైల్వేలైన్లు, జాతీయ రహదారులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. సాగరమాల పథకం కింద ఏపీకి అదనంగా రూ. 85 వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. రాష్ర్ట ప్రభుత్వం అవినీతి వల్లే ఈ నిధులు కనిపించట్లేదని ఆరోపించారు.
రాహుల్‌పై విసుర్లు..
ప్రధాని మోడీ దేశాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విదేశాల్లో దేశ పరువును తీస్తున్నారని విమర్శించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 ని రద్దు చేయాలంటే కాంగ్రెస్ వెనకడుగేసిందని కానీ తాము చేసి చూపించామని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా బీజేపీ సాధిస్తుందని.. ఏపీ నుంచి 25 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.