పశ్చిమ బెంగాల్లో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లలో గెలుస్తుందని బీజేపీ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అమిత్ షా గురువారం బంకురాలో సందర్శించారు. అక్కడ నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పనిచేయాలో చెబుతూ 250 మంది ఆఫీస్ బేరర్లకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు ఉత్సాహంతో మాత్రమే కాకుండా తెలివితో పనిచేయాలని ఆయన సూచించారు.
‘బెంగాల్‌లో 2018 ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లు గెలుచుకుంటుందని నేను చెప్పినప్పుడు.. మా ప్రత్యర్థులతో పాటు మా పార్టీ నాయకులు కూడా నన్ను చూసి నవ్వారు. కానీ, మేం గెలిచి చూపించాం. మాకు ఆ ఎన్నికల్లో 18 సీట్లు వచ్చాయి. నాలుగైదు సీట్లు కేవలం 2 వేల నుంచి 3 వేల ఓట్ల తేడాతో కోల్పోయాము. ఈ రోజు నేను బంకురాలో చెప్తున్నాను.. బిర్సా ముండా ఆశీర్వాదంతో 2021 ఎన్నికల్లో కనీసం 200 సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుంది. నేను చెప్పేది విని నవ్వాలనుకునే వారిని నవ్వనివ్వండి. మనం ప్రణాళిక ప్రకారం పనిచేస్తే బీజేపీ 200కు పైగా సీట్లను గెలుచుకుంటుంది’ అని అమిత్ షా అన్నారు.
అమిత్ షా వాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ స్పందించారు. ‘బీజేపీ వాళ్లకు ముఖ్యమంత్రి అభ్యర్థి లేడు, కార్యకర్తలు లేరు, వారికి ప్రజల నుంచి మద్దతు కూడా లేదు. బీహార్ ఎన్నికల్లో చూపించినట్లుగా ప్రధాని మోడీ చరిష్మా క్రమక్రమంగా క్షీణిస్తోంది. బెంగాల్‌లో అధికారంలోకి రావడం అనేది అమిత్ షా కల’ అని ఆయన అన్నారు.