రిపోర్ట్ పంపండి: టీటీడీ వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. తిరుపతి తొక్కిసలాట, లడ్డూ కౌంటర్‎లో అగ్ని ప్రమాద ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. వరుస ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ రేపు (జనవరి 19), ఎల్లుండి (జనవరి 20) తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులతో ఆయన భేటీ కానున్నారు. తిరుపతి తొక్కిసలాట, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాద ఘటనలపై సంజీవ్ కుమార్ జిందాల్ ఆరా తీయనున్నారు. 

ALSO READ | సంక్రాంతి ఎఫెక్ట్: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్

2025, జనవరి 8న తిరుమలలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విష్ణునివాసం వద్ద టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు.. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురం పార్క్ ప్రాంతాల్లో మరి కొందరు భక్తులు మృతి చెందారు. ఈ ఘటన మురువక ముందే.. తిరుమలలో మరో ప్రమాదం జరిగింది. శ్రీవారి లడ్డూ కౌంటర్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఇలా వరుస విషాదాలు చోటు చేసుకోవడంపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది.