నల్గొండ జిల్లా ఆస్పత్రిలో వసూళ్ల దందా

నల్గొండ జిల్లా ఆస్పత్రిలో వసూళ్ల దందా
  •  కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్​ 
  •  ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ స్వాహా చేస్తున్న ఔట్​సోర్సింగ్​ఏజెన్సీ
  • ఐదు నెలల్లో రూ.18 లక్షలు జేబులో వేసుకున్న ఘనులు 
  •  క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చి బిల్స్ పాస్ చేస్తున్న ఆఫీసర్లు
  •  చేతులు మారుతున్న లక్షల రూపాయలు 

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వసూళ్లు షరా మామూలుగానే మారాయి. కలెక్టర్​ ఆదేశాలను ఆఫీసర్లు భేఖాతరు చేశారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల నుంచి డబ్బులు వసూళ్లు చేయడం యథావిధిగానే కొనసాగుతోంది. దీనికి తోడు కొత్త దందా మొదలైంది. ఏదో ఒక సాకుతో శానిటేషన్​ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తీసేయడం,  కొత్త వాళ్లను పెట్టడాన్ని అవుట్​సోర్సింగ్ ఏజెన్సీ వ్యాపారంగా మార్చేసింది.

తీసేసిన ఉద్యోగులను తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలంటే ఒక రేటు, కొత్త ఉద్యోగాలకు మరో రేటు ఫిక్స్​చేశారు. శానిటేషన్​విభాగంలో ఏ చిన్న తప్పు జరిగినా.. వాళ్లను ఏకంగా ఉద్యోగాల నుంచి తీసేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా తీసేసిన ఉద్యోగులతో బేరసారాలు మాట్లాడుకోవడం, అలాంటి వాళ్లకు పగలు డ్యూటీలు వేస్తే ఆఫీసర్లు గుర్తుపడ్తారని, నైట్​డ్యూటీలకు పంపిస్తున్నారు. ఇంకోవైపు కొత్త ఉద్యోగులను పెడితే రూ.లక్ష, రెండు లక్షలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పీఎఫ్, ఈఎస్​ఐ స్వాహా..

ఉద్యోగుల అకౌంట్లో పీఎఫ్, ఈఎస్ఐ జమ చేయకుండా ఏజెన్సీ తన జేబులో వేసుకుంటోంది. గత ఐదు నెలల నుంచి ఉద్యోగుల అకౌంట్లలో పీఎఫ్, ఈఎస్ఐ జమ కాలేదు. ఒక్కో ఉద్యోగి పేరు మీద నెలకు సుమారు రూ.2 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో మొత్తం 180 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, నెలకు రూ.3.60 లక్షలు వాళ్ల అకౌంట్లో జమ కావాలి. కానీ అకౌంట్లలో అన్ని జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. ఐదు నెలలకు కలిపి సుమారు రూ.18 లక్షలు ఏజెన్సీ తన జేబులో వేసుకుంది. రూల్స్ ప్రకారమైతే ప్రతినెలా ఉద్యోగుల జీతాల బిల్స్​పేమెంట్​చేసేటప్పుడు ఆస్పత్రి సూపరింటెండెంట్​అన్ని రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించాకే ఏజెన్సీకి ఫెర్మాన్స్​సర్టిఫికెట్​ఇవ్వాలి.

కానీ ఇవేమీ చూడకుండానే డైరెక్ట్​గా ఫెర్మాన్స్​సర్టిఫికెట్​ ఇష్యూ చేయడమేగాక, ప్రతినెలా రూ.35 లక్షల బిల్స్​క్లైయిమ్​చేస్తున్నారు.  జీతాలు మాత్రమే ఉద్యోగులకు ఇచ్చి, వాళ్లకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ పైసలు మాత్రం ఏజెన్సీ నిర్వాహకులు స్వాహా చేస్తున్నారు. ఈ విషయం తెలియక ఉద్యోగులు తమ ఖాతాలను చెక్​చేసుకోగా, జీరో బ్యాలెన్స్ కనిపించడంతో తెల్లబోయారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్​నిత్యానందం స్పందిస్తూ.. ప్రతినెలా ఉద్యోగుల బిల్స్​ఫుల్​పేమెంట్​ చేస్తున్నాం. జీఎస్టీ ఒక్కటే కట్ చేస్తాం. మిగిలినదంతా ఏజెన్సీకి పేమెంట్​చేస్తాం. పీఎఫ్, ఈఎస్ఐ ఏజెన్సీ బాధ్యత. ఒకవేళ ఉద్యోగుల ఖాతాల్లో జమ కాకుంటే మరోసారి రికార్డులు పరిశీలిస్తామని తెలిపారు.  

 ఏజెన్సీ ఎంపికపై ఆరోపణలు..

కొత్త ఏజెన్సీ ఎంపికపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్​ హయాంలో పెట్టిన ఏజెన్సీ సరిగా పనిచేయడం లేదని కాంట్రాక్టు రద్దు చేశారు. మూడేళ్ల కాంట్రాక్టు గడువు ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు, సరియైన ఆధారాలు చూపకుండానే కాంట్రాక్టు​రద్దు చేసి వేరొకరికి కట్టబెట్టారు. రూల్స్ ప్రకారమైతే రద్దు చేసిన ఏజెన్సీ ప్లేస్​లో టెండర్లు పిలిచినప్పుడు సెకండ్​ప్లేస్​లో ఉన్న ఏజెన్సీకి కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఎలాంటి అర్హత లేని ముంబైకి చెందిన ఏజెన్సీని రంగంలోకి దింపారు. ఈ ఏజెన్సీ నుంచి సబ్​కాంట్రాక్టు తీసుకున్న ప్రైవేట్​వ్యక్తులు ఆస్పత్రిలో దందా నడిపిస్తున్నారు. 

ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం 

ఆస్పత్రిలో పేషెంట్ల నుంచి పైసలు వసూళ్లు చేస్తున్న వారిపై ఎంక్వైరీ చేస్తాం. కచ్చితంగా వాళ్లపై యాక్షన్​ తీసుకుంటాం. పాత ఉద్యోగులను తీసేయడం, కొత్త వాళ్లను పెట్టడంపై కూడా విచారణ చేయిస్తాం. ఆస్పత్రి ప్రక్షాళనకు ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. ఎవరైనా తప్పు చేసినట్లు ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటాం. 

సి.నారాయణరెడ్డి, కలెక్టర్​

కొద్ది రోజుల క్రితం కాన్పుల వార్డులో ఒక పేషెంట్​నుంచి పేషెంట్ కేర్​రూ.700 వసూళ్లు చేశారు. దీంట్లో సగం వాటా మరో పేషెంట్​కేర్​ఇచ్చారు. ఈ విషయం తెలిసిన ఏజెన్సీ సూపర్​వైజర్​ఉదయం డ్యూటీకి రావొద్దని చెప్పి, తిరిగి సాయంత్రానికే పేషెంట్ కేర్​తో రూ.50 వేలు బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన మిగితా స్టాఫ్​సూపర్​వైజర్ పై గొడవకు దిగినట్టు తెలిసింది.

ఐదు నెలలకు ముందు వివిధ కారణాలతో అధికారులు ముగ్గురిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ ఐదు నెలల కాలంలో సూపర్​వైజర్లు, పేషెంట్​కేర్, స్వీపర్స్​తో కలిపి మరో 8 మందిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఏదో ఒక సాకు చూపడం ఉద్యోగాల నుంచి తీసేయడం పనిగా పెట్టుకున్న ఏజెన్సీ.. వాళ్ల ప్లేస్​ లో కొత్త వాళ్లను పెట్టుకునేందుకు ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష నుంచి రెండు లక్షలు వసూళ్లు చేసినట్టు తెలిసింది. ఐదు నెలలకు ముందు అధికారులు తీసేసిన ముగ్గురు ఉద్యోగులతో సెటిల్మెంట్​చేసుసుకుని నైట్​షిఫ్ట్​డ్యూటీలకు పంపిస్తున్నారు.