ఉగ్ర లింకులపై ఆరా.. నల్గొండ,  భువనగిరిలో  సెంట్రల్​ ఇంటెలిజన్స్​  సీక్రెట్​ ఆపరేషన్​  ​

  • ఉగ్ర లింకులపై ఆరా
  • నల్గొండ,  భువనగిరిలో  సెంట్రల్​ ఇంటెలిజన్స్​  సీక్రెట్​ ఆపరేషన్​  ​
  • నల్గొండ  కేంద్రంగా గతంలో  టెర్రరిస్టుల కార్యకలాపాలు
  • పాత  టీంలు మళ్లీ  యాక్టివ్​ కావొచ్చనే కోణంలో విచారణ

నల్గొండ, వెలుగు : హైదరాబాద్​లో  కలకలం రేపిన టెర్రరిస్టు కార్యకలాపాలతో  ఉమ్మడి నల్గొండ జిల్లాతో  ఏమైనా లింకులున్నాయా.. అనే  దిశగా  సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ సీక్రెట్​ ఆపరేషన్​ చేస్తోంది.  కొద్దిరోజుల కింద హైదరాబాద్​ ఓల్డ్​సిటీలో  టెర్రరిస్టుల కదలికలు బయటపడడంతో ఉమ్మడి జిల్లాలో  సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్లు అలర్టయ్యారు. హైదరాబాద్​లో ఏటీఏస్​ పట్టుకున్న హిజ్బ్​ ఉ త్ తహ్రీర్​ కార్యకలాపాలు నల్గొండ,  భువనగిరిలోనూ ఉండొచ్చని ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. నల్గొండ  హబ్​గా గతంలో ఉగ్ర కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి.  జిల్లాకు చెందిన వారే  లష్కర్​ ఇ తోయిబా, జైష్​ ఇ మహ్మద్​, హు జీ తదితర పాకిస్థాన్​ ప్రేరేపిత తీవ్రవాదం వైపు మొగ్గుచూపి పలు నేరాలకు పాల్పడిన సంఘటనలు సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ రికార్డ్స్​లో నమోదయ్యా యి.  ఈ  బ్యాక్​గ్రౌండ్​తో  ప్రస్తుతం ఏటీఏస్​ పట్టుకున్న హిజ్బ్​ ఉత్ తహ్రీర్ కార్యకలపాలతో  నల్గొండ, భువనగిరిలో లింకులు దొరికే  చాన్స్​ ఉందని  ఇంటెలిజెన్స్​ ఆఫీసర్లు భావిస్తున్నారు.

ఐఎస్ఐ టెర్రరిస్టులకు అడ్డా..

ఉగ్రవాద  సంస్థ  హిజ్బ్​ ఉత్​ తహ్రీర్​ టార్గెట్​ మతమార్పిడులే కావడంతో ఆ యాంగిల్​లో విచారణ చేస్తున్నారు.  పోలీస్​ డిపార్ట్​మెంట్​లోని పలువురు సీనియర్​ ఆఫీసర్లు కూడా ఈ విచారణలో  ఉన్నట్లు తెలిసింది. సిమి (స్టూడెంట్​ ఇస్లామిక్​ మూమెంట్​ ఆఫ్​ ఇండి యా)కి  దేశంలో మూలాలు వేసిన సయ్యద్​ సలావుద్దీన్​, బాబా శంషోద్దీన్​ నల్గొండకు చెందిన వారే. హర్కత్​ ఉల్​ జిహద్​ అల్​ ఇస్లామీ (హుజీ) దక్షిణ భారత కమాండ్​ షేక్​ అబ్దుల్​ ఖాజాది మునుగోడు మండలం వెల్మకన్నె.  లష్కర్​ ఇ తోయిబాలో కీలక బాధ్యతల్లో పనిచేసిన జిల్లా కేంద్రానికి చెందిన గులాం యజ్దాని అలియాస్​ నవీద్​,  హుజీ  కమాండర్​ సయ్యద్​ బిలాల్​ ఎన్​కౌంటర్లలో హతమయ్యారు.  జాతీయ, అంతర్జాతీయ  టెర్రరిస్టు సంస్థలైన వీటితో  హిజ్బ్​ ఉత్​ తహ్రీర్​ సంస్థ చేతులు కలిపే అవకాశం ఉండొచ్చన్న  పక్కా సమాచారంతో  సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ బ్యూరో  లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.  

కనిపించకుండా పోయిన యువకులు.. 

ముంబై, బెంగళూరు, జైపూర్​ బాంబు పేలుళ్ల  ఘటనల తర్వాత నల్గొండ జిల్లాలో సుమారు 25 మంది యువకులు కనిపించకుండా పోయినట్లు దాఖలాలున్నాయి. ఉగ్ర కదలికలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్​ ఇచ్చేందుకు నియమించిన ప్రత్యేక సెల్​ కొంత కాలంగా సైలెంటయ్యింది.  ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది గత పది, పదిహేనేళ్ల నుంచి పాతుకుని పోవడంతో ఉగ్రవాదుల యాక్టివిటీ గురించి పక్కా సమాచారం రావట్లేదని మాజీ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు.